Let's talk: editor@tmv.in
అవయవ దానంలో తెలంగాణ దేశానికే ఆదర్శం కావాలి: మంత్రి దామోదర్

అవయవ దానంలో తెలంగాణ దేశానికే ఆదర్శం కావాలి: మంత్రి దామోదర్

Gaddamidi Naveen
11 మార్చి, 2026

రాష్ట్రంలో అవయవ మార్పిడి చికిత్సల వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆక్ట్ పాలసీ రూపకల్పనతో పాటు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని మంత్రి నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో అవయవ మార్పిడి చికిత్సల అమలు విధానం, ప్రైవేటు ఆసుపత్రుల పాత్ర, దాతల నుంచి లభించే అవయవాల వినియోగంపై మంత్రి చర్చించారు. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు అవసరమైన విధివిధానాలను మరింత సరళీకృతం చేయాలని అధికారులకు సూచించారు. అవయవ మార్పిడి చికిత్సల విషయంలో తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు.

అవయవ మార్పిడి చికిత్సల ఖర్చుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు మంత్రి స్పష్టమైన సూచనలు చేశారు. ప్రస్తుతం కొన్ని ఆసుపత్రుల్లో ఈ చికిత్సలకు అధిక ఖర్చులు వసూలు చేస్తున్నారని పేర్కొంటూ, సామాన్య ప్రజలు కూడా ఈ చికిత్సలను పొందగలిగేలా ధరల నియంత్రణ అవసరమని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మంత్రి చేసిన సూచనలకు ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

దాతలు ఇచ్చిన అవయవాలు వృథా కాకుండా ఆసుపత్రులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అవయవ మార్పిడి కోసం ఇతర దేశాల నుంచి వచ్చే రోగుల సౌకర్యార్థం కొత్త విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చెయ్యి మార్పిడి చికిత్స కోసం ఇప్పటికే నాలుగు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. నరేంద్ర కుమార్ తదితర అధికారులు, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

అవయవ దానంలో తెలంగాణ దేశానికే ఆదర్శం కావాలి: మంత్రి దామోదర్ - Tholi Paluku