Let's talk: editor@tmv.in
అవకాడో సాగుతో రైతులకు కొత్త ఆదాయ మార్గాలు: ప్రధాని మోడీ
అవకాడో సాగుతో రైతులకు కొత్త ఆదాయ మార్గాలు: ప్రధాని మోడీ

అవకాడో సాగుతో రైతులకు కొత్త ఆదాయ మార్గాలు: ప్రధాని మోడీ

Gaddamidi Naveen
31 ఆగస్టు, 2026

దేశంలో ఒకప్పుడు పెద్దగా పరిచయం లేని అవకాడో పండు సాగు ఇప్పుడు రైతులకు కొత్త ఆదాయ మార్గాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్‌లో ఆయన అవకాడో సాగుతో లాభాలు పొందుతున్న దక్షిణ భారత రైతుల ఉదాహరణలను ప్రస్తావించారు.

గతంలో అవకాడోకు దేశంలో పెద్దగా డిమాండ్, విలువ ఉండేది కాదని, ప్రస్తుతం ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో దీనికి ఆదరణ పెరిగిందని మోడీ తెలిపారు. దీంతో రైతులకు కొత్త పంటల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన వరదరాజ్‌ గతంలో టమాటా, అరటి పంటలు సాగు చేసేవారని మోడీ చెప్పారు. ఓ స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూసిన ఆయన, అనంతరం యూట్యూబ్‌ ద్వారా సాగు విధానాలపై సమాచారం తెలుసుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు నాలుగు టన్నుల అవకాడోను పండించిన వరదరాజ్‌.. వాటిని స్థానిక దుకాణాలకు నేరుగా విక్రయిస్తున్నారని చెప్పారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్‌ ఆయన ఆదాయాన్ని గణనీయంగా మార్చాయని వివరించారు.

తమిళనాడులోని కొడైకెనాల్‌కు చెందిన చంద్రశేఖరన్‌ అర హెక్టారులో అవకాడో సాగు ప్రారంభించి మంచి ధరలు పొందుతున్నారని మోడీ తెలిపారు. కర్ణాటకలోని చిక్కమగళూరులో కాఫీ తోటల మధ్య అవకాడోను సాగు చేస్తూ, కాఫీతో పాటు మిరియాల నుంచి వచ్చే ఆదాయానికి అదనంగా రైతులు సంపాదిస్తున్నారని చెప్పారు. నగరాల్లో ‘అవకాడో టోస్ట్‌’కు పెరుగుతున్న ఆదరణను ప్రస్తావిస్తూ.. రైతులు అదే అవకాడోతో ఆదాయానికి ‘కొత్త రెసిపీ’ని కనుగొన్నారని మోడీ వ్యాఖ్యానించారు.