
అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఈడీ సోదాలు
ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన కారు బ్లాస్ట్ ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా మనీలాండరింగ్ కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం తెల్లవారుజామున భారీ సోదాలను ప్రారంభించింది. ఢిల్లీ, ఫరీదాబాద్ సహా 25 లొకేషన్లలో ఉదయం 5 గంటల నుంచే ఈడీ దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం. సోదాలు ప్రధానంగా ఓఖ్లాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ కార్యాలయం, ఆ యూనివర్సిటీ ట్రస్టీలు, సంబంధిత వ్యక్తుల నివాసాలు, సంస్థల కార్యాలయాలపై జరుగుతున్నాయని వర్గాలు తెలిపాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
యూనివర్సిటీపై పెరుగుతున్న అనుమానాలు
రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్-ఉన్-నబీ ఈ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేయడంతో, సంస్థపై భద్రతా శాఖల దృష్టి మరింత కేంద్రీకృతమైంది. పలువురు డాక్టర్ల అరెస్టుల తర్వాత యూనివర్సిటీ కార్యకలాపాలపై అధికారులకు అనుమానాలు పెరిగాయి. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జవాద్‌ను కూడా ఢిల్లీ పోలీసు క్రైంబ్రాంచ్ ప్రశ్నించనుంది. ఈ విషయమై వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
యూనివర్సిటీపై రెండు కేసులు
క్రైం బ్రాంచ్ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసింది. యూజీసీ 12బీ సర్టిఫికెట్ ఉన్నదని వెబ్‌సైట్‌లో తప్పుడు ప్రకటన చేసి విద్యార్థులను మోసగించిన కేసు, 2018లో గడువు ముగిసినా న్యాక్ అక్రిడిటేషన్ లేకుండానే అడ్మిషన్లు తీసుకున్న కేసును నమోదు చేసింది.
డ్రోన్లు, రాకెట్లతో దాడికి ప్రయత్నాలు
కేసు మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు సాంకేతిక సహాయం అందించిన జాసిర్ బిలాల్ వాని అలియాస్ దానిష్ ను ఎన్ఐఏ శ్రీనగర్‌లో అరెస్టు చేసింది. వీరు దేశంలో దాడులు చేయడానికి అవసరమైన విధంగా డ్రోన్లను మోడిఫై చేశారని , రాకెట్ల తయారీకి జాసిర్ ప్రయత్నించాడని, అలాగే రెడ్‌ఫోర్ట్ కారుబ్లాస్ట్‌కు ముందు కీలక సాంకేతిక సాయం అందించాడని ఎన్ఐఏ వివరించింది. దాంతో పాటు ఇతడు కూడా మరో సూసైడర్ గా మారాలనుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్ మూడు నెలల క్రితం ప్రత్యేక పాత్రలతో ఉన్న పేరుతో సిగ్నల్ గ్రూప్ సృష్టించాడు. అందులో ముజమ్మిల్, అదీల్, ముజఫర్, ఇర్ఫాన్ వంటి కీలక సభ్యులను చేర్చాడు. దీని ద్వారా అంతర్గతంగా వారి మధ్య కమ్యూనికేషన్, ఆయుధాల తరలింపు, రాడికలైజేషన్ కార్యకలాపాలు జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జాసిర్ బిలాల్ వాని అలియాస్ దానిష్‌ను ఢిల్లీ పటియాలా హౌస్‌లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు మంగళవారం 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి పంపింది. భారీ భద్రత మధ్య నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి అంజు బజాజ్ చందానా ఇన్-కెమేరా విచారణ అనంతరం రిమాండ్కు పంపారు.
అప్పుడే ఆయుధాల కొనుగోలు
డాక్టర్ షాహీన్ కారులో లభించిన క్రింకోవ్ రైఫిల్, పిస్టల్ ఈ కేసుకు కీలక లింక్‌గా మారాయి. విచారణలో ఈ ఆయుధాలను ఉమర్ 2024లో కొనుగోలు చేసి ఇర్ఫాన్‌కి అప్పగించాడని, డాక్టర్ షాహీన్ ఈ గ్యాంగ్‌కు అత్యధిక ఆర్థిక సహాయం చేసినట్లు తేలినట్టు అధికారులు చెప్పారు.
దర్యాప్తులో బయటపడిన వివరాలు
అక్టోబర్ 2023: అదీల్, ఉమర్ – రైఫిల్‌తో మస్జిద్ అలీ వద్ద ఇర్ఫాన్‌ను కలుసుకుని, రైఫిల్ శుభ్రం చేసుకుని వెళ్లిపోయారు.
నవంబర్ 2023: మళ్లీ అదీల్ రైఫిల్‌తో ఇర్ఫాన్ వద్దకు వెళ్లగా ముజమ్మిల్, షాహీన్ కూడా చేరారు. తర్వాత రోజు అదీల్ తిరిగి వచ్చి ఆయుధాన్ని తీసుకెళ్లాడు.
