Let's talk: editor@tmv.in
అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం

అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం

Gaddamidi Naveen
30 జులై, 2026

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభమైన అల్వాల్‌లోని 1000 పడకల ‘తెలంగాణ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) ఆసుపత్రి నిర్మాణ పనులను బుధవారం బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆసుపత్రి పనులు త్వరలోనే పూర్తవుతాయని హామీలు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ప్రారంభోత్సవంలో జాప్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.

ఈ పరిశీలన అనంతరం బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ మ‌న్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఆసుపత్రిని సందర్శించి 90 శాతం పనులు పూర్తయ్యాయని స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. అయినా, మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.

కేసీఆర్ తెచ్చిన గుర్తులను, పథకాలను తుడిచిపెట్టేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యల వల్లే ఈ కీలకమైన ప్రజా వైద్య ప్రాజెక్టును పక్కనబెట్టారని క్రిశాంక్ ఆరోపించారు. ఈ 1000 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే అందుబాటులోకి తేకుండా, వచ్చే ఎన్నికల వరకు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు.

అలాగే, బీఆర్‌ఎస్ నేతల పర్యటనను స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మిస్తున్న ఆసుపత్రిని సందర్శించడానికి అనుమతులు కావాలనడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. బీఆర్‌ఎస్ బృందం పరిశీలన సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కాంగ్రెస్ రాజకీయ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని మండిపడ్డారు.

ట్యాగ్‌లు
BRSKCRTIMSHospitalAlwalTIMSTelanganaHyderabadPublicHealthcareHealthcareRevanthReddyCongressTelanganaPoliticsHealthInfrastructureBreakingNews
అల్వాల్ టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం - Tholi Paluku