Let's talk: editor@tmv.in
అల్లూరి జిల్లాలో విషాదం.. వాగులో మునిగి ముగ్గురు బాలురు మృతి

అల్లూరి జిల్లాలో విషాదం.. వాగులో మునిగి ముగ్గురు బాలురు మృతి

Panthagani Anusha
14 ఏప్రిల్, 2026

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకుందామని వెళ్లిన చిన్నారులను మృత్యువు వాగు రూపంలో కబళించింది.అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పర్రెడ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే

పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పర్రెడ గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు ఆదివారం సెలవు దినం కావడంతో సమీపంలోని కాలువ బండ్ వద్దకు వెళ్లారు. అక్కడ కాసేపు ఆడుకున్న అనంతరం వారిలో ముగ్గురు బాలురు మాట్యా వాగు సమీపంలోని నీటిలోకి దిగారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఇసుక మృత్తి లో చిన్నారులు ఊబిలా చిక్కుకుపోయారు. బయటకు రావడానికి వారు ఎంత ప్రయత్నించినా లోతు ఎక్కువగా ఉండటం బురదలో కూరుకుపోవడంతో నీటిలో మునిగిపోయారు.

గట్టుపై ఉన్న మిగిలిన ఇద్దరు బాలురు కేకలు వేయడంతో సమీపంలో పడవ మరమ్మతులు చేసుకుంటున్న వ్యక్తి మరియు స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వారు వెంటనే నీటిలోకి దిగి ఇద్దరు బాలురను సురక్షితంగా బయటకు తీయగలిగారు. అయితే నీరు అస్పష్టంగా ఉండటం లోతు ఎక్కువగా ఉండటంతో కోడా ప్రదీప్ (9), పాంగి శ్రీను (10), జలంగి హర్షిత్ (10) అనే ముగ్గురు చిన్నారులను కాపాడలేకపోయారు. అప్పటికే వారు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఆ ప్రాంతంలో నీటి లోతు ఎక్కువగా ఉందని ప్రమాదకరమని ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ చిన్నారులు గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో పర్రెడ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు నీటి వనరుల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తత వహించాలని అధికారులు కోరుతున్నారు.