
అల్ఫలాహ్ చైర్మన్‌కు మధ్యంతర బెయిల్ ఎలా ఇస్తారు?: ఈడీ
అల్ ఫలాహ్ యూనివర్సిటీ గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్ధిఖీకి ఢిల్లీ లోకల్ కోర్టు ఇచ్చిన రెండు వారాల మధ్యంతర బెయిల్‌ను సవాలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున ఆయన బయటకు వస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్ ఫలాహ్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి తీసుకున్న ఫీజుల ద్వారా అక్రమంగా నిధులు సమీకరించారనే ఆరోపణలపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో సిద్ధిఖీకి ఢిల్లీ కోర్టు శనివారం రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాలేజీలకు ఉన్న గుర్తింపు, అక్రిడిటేషన్ అంశాలను తప్పుగా చూపిస్తూ విద్యార్థులను మోసం చేసి డబ్బు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ఈడీ నవంబర్ 2025లో సిద్ధిఖీని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై జైలులో ఉన్నారు. ఈ మనీ లాండరింగ్ కేసు, విద్యార్థులను మోసం చేసినట్లు నమోదైన ఢిల్లీ పోలీసుల రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా నమోదు చేశారు. తన భార్యకు స్టేజ్-4 క్యాన్సర్ ఉండటంతో ఆమెకు సహాయం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిద్ధిఖీ కోర్టును కోరారు. ఆమెకు మార్చి 12న కీమోథెరపీ చికిత్స ఉండటంతో తన సహాయం అవసరమని ఆయన తరపున న్యాయవాదులు వాదించారు. లోకల్ కోర్టు తమ వాదనలను గంభీరంగా పరిగణలోకి తీసుకోలేదని, అందువల్ల త్వరలోనే ఢిల్లీ హైకోర్టులో ఈ ఉత్తర్వును సవాలు చేయనున్నామని ఈడీ అధికారులు తెలిపారు . గత ఏడాది నవంబర్ 10న జరిగిన ఎర్రకోట పేలుళ్ల కేసుకు సంబంధించి సిద్ధిఖీపై అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉప) కింద మరో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని ఈడీ పేర్కొంది.
ఈడీ చార్జ్‌షీట్ ప్రకారం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఇద్దరు డాక్టర్లు, రెడ్ ఫోర్ట్ పేలుడులో ఆత్మాహుతి దాడి చేసినట్లు గుర్తించిన మరో డాక్టర్ సహా ముగ్గురు వ్యక్తులను అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో పోలీసు వెరిఫికేషన్ లేకుండానే నియమించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నియామకాలు సిద్ధిఖీ నియంత్రణలో ఉన్న విశ్వవిద్యాలయంలో జరిగాయని ఈడీ తెలిపింది. సిద్ధిఖీకి భారీ ఆర్థిక వనరులు ఉన్నందున ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేయడం లేదా దర్యాప్తును దెబ్బతీయడం జరిగే అవకాశం ఉందని ఈడీ కోర్టులో వాదించింది. ఇంకా కేసులో అనేక అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా తెలిపింది. అలాగే సిద్ధిఖీ భార్య గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ చికిత్స పొందుతున్నప్పటికీ, ఆమె ఈడీ ఎదుట హాజరైనప్పుడు ఎవ్వరూ సహాయకులుగా లేరని అధికారులు తెలిపారు. అందువల్ల ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని, భర్త సహాయం తప్పనిసరి కాదని ఈడీ వాదించింది.
కోర్టు మాత్రం తన ఉత్తర్వులో, కుటుంబ సభ్యుల వైద్య కారణాల నేపథ్యంలో ఖైదీలకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం చట్టబద్ధమైన పద్ధతేనని పేర్కొంది. సిద్ధిఖీకి బెయిల్ మంజూరు చేస్తూ పాస్‌పోర్ట్‌ను విచారణాధికారికి అప్పగించాలి, కేసులో ఉన్న ఫిర్యాదుదారులు లేదా సాక్షులను బెదిరించకూడదని వంటి కొన్ని షరతులు విధించింది. ఈడీ దర్యాప్తు ప్రకారం, అల్ ఫలాహ్ యూనివర్సిటీ 2018 నుంచి 2025 మధ్యకాలంలో సుమారు రూ.415.10 కోట్లు సమీకరించింది. విద్యార్థుల నుంచి సేకరించిన ఈ నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే రెడ్ ఫోర్ట్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో సంబంధం ఉన్న డాక్టర్లతో ఈ సంస్థకు సంబంధం ఉందన్న కారణంతో యూనివర్సిటీపై విచారణ మరింత తీవ్రమైంది.
