
అలాంటి ఉద్యోగాలకు రామ్‌రామ్!
ఇప్పుడు ఉద్యోగాల విషయంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. 10-15ఏళ్ళ క్రితం వరకు ఉద్యోగం అంటే ఒక స్థిరమైన జీతం, పర్మనెంట్ జాబు, పెన్షన్ లేదా కనీసం సెక్యూరిటీ ఉండాలి అనే ఆలోచన ఉండేది. ఒకసారి ఉద్యోగం దొరికితే దాన్ని జీవితాంతం పట్టుకోవడమే లక్ష్యం. కానీ ఈ తరం మిల్లెనియల్స్‌కి, జెన్-జడ్ ఉద్యోగులకు ఇది సరిపోవడం లేదు.
వాళ్లకు సరిపడ జీతం ఉన్నా, 'నేను చేస్తున్న పనికి అర్ధముందా? నా ఐడియాలు వినిపిస్తున్నాయా? నా పని వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగం జరుగుతోందా?' అనే ఆలోచన ఎక్కువ. డెలోయిట్, ఈవై లాంటి పెద్ద పెద్ద రిపోర్టులు క్లియర్‌గా కొన్ని విషయాలు చెబుతున్నాయి. 80శాతం మందికి టూల్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి కానీ కేవలం 47శాతం మందికే తమకు నిజమైన ఇన్నోవేషన్ చేసే అవకాశం ఇస్తున్నారనే ఫీలింగ్ ఉంది.
దీని వల్ల ఒక ఇంపాక్ట్ గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్ వల్లే 40శాతం మిల్లెనియల్స్ తమ ఉద్యోగాలు వదిలేయాలని ఆలోచిస్తున్నారు. అంటే జీతం, సౌకర్యాలు ఉన్నా, పర్పస్ లేకపోతే ఈ తరం ఉద్యోగులకు జాబ్‌లో కంటిన్యూ అవ్వాలనే ఆలోచన పోతోంది. నేటి ఉద్యోగులకు పని అంటే కేవలం ఒక టాస్క్ పూర్తి చేయడం కాదు. వాళ్లు చేసే పనికి విలువ ఉండాలి. ఉదాహరణకు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒక యాప్ డెవలప్ చేస్తే అది సమాజానికి ఉపయోగం అవ్వాలి, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేసే క్యాంపైన్ ద్వారా మంచి మెసేజ్ వెళ్ళాలి. ఇది లేకపోతే వాళ్లకు ఆ పని వృథాగా అనిపిస్తుంది.
డెల్ టెక్నాలజీస్ లాంటి కంపెనీలు దీన్ని అర్థం చేసుకొని సస్టైనబిలిటీ ప్రాజెక్టులు, డిజిటల్ ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లు ఉద్యోగులతో కలిపి చేస్తున్నారు. టాటా మోటార్స్ ఎర్న్ &లెర్న్ ప్రోగ్రామ్‌లో 15,000 అప్రెంటైసులు ఒకేసారి చదువు, లైవ్ ప్రాజెక్ట్ రెండూ చేస్తున్నారు. ఇక పాత తరం ఒక కంపెనీలో 25 సంవత్సరాలు పనిచేస్తూ పదవీ విరమణ చేయడం గర్వంగా భావించేది. కానీ మిల్లెనియల్స్‌కి ఒకే కంపెనీలో 20 సంవత్సరాల పనిచేయడమనేది భయంకరమైన ఆలోచన. వాళ్లకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక కొత్త ఛాలెంజ్ కావాలి, కొత్త వాతావరణం కావాలి, కొత్త పర్పస్ కావాలి. ఈవై సర్వేలో 23 దేశాల 17,000 ఉద్యోగులను అడిగితే 40శాతం మంది వచ్చే ఏడాదిలో ఉద్యోగం వదిలేస్తామని చెప్పారు. ఇది ఒక పెద్ద వార్నింగ్ లాంటిది.
ఈ మార్పు వల్ల కంపెనీలు కూడా తమ వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు క్యాఫెటీరియా, ఫ్రీ లంచ్, జిమ్ వంటివి సరిపోతుండేవి. కానీ ఇప్పుడు అది చాలదు. ఒక ఉద్యోగి తన పని వల్ల పెద్ద పిక్చర్‌లో ఏమి మార్పు వస్తుందో చూపించగలిగితేనే అతను ఆ కంపెనీలో ఎక్కువకాలం ఉంటాడు. చిన్న కంపెనీలకైతే ఇది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే వాళ్లు జీతం, పెర్క్స్‌లో పెద్ద కంపెనీలతో పోటీ పడలేరు. కాబట్టి 'మన పని వల్ల సమాజానికి ఈ ప్రయోజనం' అని చూపించగలిగితేనే టాలెంట్ నిలబెట్టుకోగలరు.
ఇకపై ఉద్యోగాల మార్కెట్‌లో ఒక స్పష్టమైన ట్రెండ్ కనబడుతోంది. అదే 'పెర్క్స్ వర్సెస్ పర్పస్' అనే పోరులో పర్పస్ గెలుస్తుంది. మిల్లెనియల్స్‌కి, జెన్-జడ్‌కి జీతం రెండో స్థానంలో ఉంటుంది, మొదటి స్థానంలో అర్ధం ఉండే పని, ఇన్నోవేషన్‌కి ఛాన్స్, సమాజానికి ఉపయోగం. కంపెనీలు దీన్ని అర్థం చేసుకోకపోతే ప్రతిభావంతులైన యువత ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతారు. కానీ దీన్ని అర్థం చేసుకున్న కంపెనీలు మాత్రం కొత్త ఆలోచనలతో, కొత్త ఇన్నోవేషన్‌లతో ముందుకు వెళ్తాయి.
అంటే క్లియర్‌గా చెప్పాలంటే, మిల్లెనియల్స్‌కి ఉద్యోగం ఒక లైఫ్‌టైమ్ కాంట్రాక్ట్ కాదు, అది ఒక అర్ధవంతమైన ప్రయాణం. దానిలో అర్ధం లేకపోతే వారు ఎప్పుడైనా జాబ్ మానేయడానికి రెడీగా ఉంటారు.
