
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
గత కొంతకాలంగా వివాదాల సుడిగుండంలో ఉన్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఏప్రిల్ 9వ తేదీ నాటి లేఖలో తక్షణమే అమలులోకి వచ్చేలా తాను విధులను వీడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజీనామా వెనుక గల కారణాలను వివరించి రాష్ట్రపతి కార్యాలయాన్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదని చెబుతూనే, తీవ్ర ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. తన రాజీనామా ప్రతిని భారత ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపారు.
నగదు వివాదం.. బదిలీ వేటు
గత ఏడాది జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు పట్టుబడినట్లు వచ్చిన ఆరోపణలు న్యాయవ్యవస్థలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వివాదం కారణంగానే ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. 2025 ఏప్రిల్ 5న ఆయన అలహాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏడాది గడుస్తున్నా ఆ వివాదం ఆయనను వదిలిపెట్టలేదు. ఈ నేపథ్యంలోనే ఇన్-హౌస్ విచారణతో పాటు పార్లమెంటరీ కమిటీ విచారణను కూడా ఆయన ఎదుర్కొంటున్నారు.
అభిశంసన దిశగా పార్లమెంటరీ కమిటీ
‘ నగదు రికవరీ’ అంశంపై జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియను చేపట్టే దిశగా పార్లమెంటరీ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చి 13 నుంచి 21 వరకు కమిటీ రోజువారీ విచారణ చేపట్టింది. ఈ కమిటీ ముందు హాజరైన జస్టిస్ వర్మ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తన నివాసంలో ఎలాంటి నగదు పట్టుబడలేదని, ఆ సమయంలో తాను ఘటనా స్థలంలో లేనని కమిటీకి వివరణ ఇచ్చారు.
విచారణ కొనసాగుతుండగానే నిష్క్రమణ
పార్లమెంటరీ కమిటీ ప్రస్తుతం కీలక పత్రాలు, సాక్ష్యాధారాలను పరిశీలిస్తోంది. కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించడం తనకు దక్కిన గౌరవమని రాజీనామా లేఖలో పేర్కొన్నప్పటికీ, ఆరోపణల నేపథ్యంలో ఆయన వైదొలగడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అటు ఇన్-హౌస్ విచారణ, ఇటు పార్లమెంటరీ కమిటీ విచారణ తుది దశకు చేరుకున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.
