Let's talk: editor@tmv.in
అలరించేలా ‘విజయవాడ ఉత్సవ్’

అలరించేలా ‘విజయవాడ ఉత్సవ్’

FL - SUNL
17 సెప్టెంబర్, 2025

విజయవాడ నగరాన్ని సాంస్కృతిక, పర్యాటక రాజధానిగా నిలిపేందుకు ‘విజయవాడ ఉత్సవ్’ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు దసరా సమయంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేలా రూపొందించనున్నారు. మంగళవారం నగరంలోని ఫార్చ్యూన్ మురళి హోటల్లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు పాల్గొని, ఈ ఫెస్టివల్ను విజయవంతం చేయడానికి సలహాలు, సూచనలు అందించారు. సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం, అంతరించిపోతున్న కళలను పరిరక్షించడంతో పాటు స్థానిక ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తూ, విజయవాడ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పనుంది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

విజయవాడ ఉత్సవ్లో గొల్లపూడిలో 45 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, సంగీత కళాశాల వంటి ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు మైసూర్ దసరా తరహాలో దీపకాంతులతో నగరాన్ని సుందరంగా మార్చనున్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ అధికారులు, వేద పండితుల సలహాలతో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఎగ్జిబిషన్ టిక్కెట్ ధర 30 రూపాయలుగా నిర్ణయించగా, ఇందులో ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ ఎక్స్పోలు, సెమినార్లు, స్టాళ్లు, రైడ్స్, ఇన్నోవేషన్ ప్రదర్శనలు ఉంటాయి. ఈ ఉత్సవాలకు భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, స్థానిక కళలను పునరుజ్జీవనం చేయడంతో పాటు, విజయవాడను దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రంగా నిలపడానికి ఈ ఉత్సవం కీలకమని పేర్కొన్నారు.

మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధమని, ఈ ఉత్సవాలు నగర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పనున్నాయని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఈ ఉత్సవాలను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదని, కనక దుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలు విజయవాడను పర్యాటక హబ్గా మార్చడంతో పాటు, స్థానిక వ్యాపారాలకు ఊతమిచ్చి, ఆర్థిక చైతన్యాన్ని తీసుకొస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రతి ఏటా విజయవాడ ఉత్సవ్, బందరు బీచ్ ఫెస్టివల్లతో కృష్ణా జిల్లాను పర్యాటక కేంద్రంగా నిలపాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవాడ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా అందరూ కలిసి కృషి చేయాలని కోరారు.

ఫోటో రైటప్: సమావేశంలో ఉత్సవాల గురించి వివరిస్తున్న మంత్రి పార్థసారధి, ఇతర మంత్రులు, నాయకులు, అధికారులు

అలరించేలా ‘విజయవాడ ఉత్సవ్’ - Tholi Paluku