
అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు: కేటీఆర్
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నందినగర్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ నేతృత్వంలోని ఎస్‌ఐఆర్ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ, ఎదురవుతున్న సమస్యలను కమిటీ నేతలు కేటీఆర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పూర్తి వివరాలు లేని లక్షలాది మంది ఓటర్లను నోటీసుల విభాగంలో చేర్చారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేసి, నోటీసులు అందిన అర్హులైన ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం చేయాలన్నారు. డూప్లికేట్ లేదా అనర్హులైన ఓటర్లను తొలగిస్తూనే, అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూసే బాధ్యతను ఒక యజ్ఞంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో నిమగ్నం కావాలని, ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత 'క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్' ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నియోజకవర్గ, సభ్యత్వ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు పరస్పరం సహకరించుకుంటూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, జీవన్ రెడ్డి, బాల్క సుమన్, పార్టీ కీలక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
