
అర్రా డబుల్ మర్డర్ పై కూడా మాట్లాడండి:తేజస్వీ యాదవ్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ లో మాటల తుటాలు పేలుతున్నాయి. కూటములలోని నాయకులు బాణాలు సంధించుకుంటున్నారు. ఇటీవల నరేంద్రమోడీ చాప్రా సభలో గతంలోని ఆర్జేడీ పాలనను జంగిల్ రాజ్ అని, గతంలో జరిగన దారుణాలను గుర్తు చేశారు. తాజాగా అర్రాలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ పై తేజస్వీ ప్రధానిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కూడా ఎన్నికల సభల్లో మాట్లాడలని చురకలంటించారు.
బీహార్‌లోని అర్రా పట్టణంలో తండ్రి–కొడుకులను దారుణంగా హత్య చేసిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆర్‌జేడీ నేత, మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. శనివారం
ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన తేజస్వీ, మోడీ గారు, అర్రాలో ప్రమోద్ కుశ్వాహా, ప్రియంశు కుశ్వాహా అనే తండ్రి–కొడుకులను అధికారంలో ఉన్న వారి అనుచరులు కాల్చి చంపారు. దయచేసి మీ ప్రసంగంలో ‘ఈ జంగిల్ రాజ్’ గురించి కూడా చెప్పండి. మీ అభ్యర్థులే రక్తపాతం సృష్టిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
అర్రా (భోజ్‌పూర్ జిల్లా)లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి శుక్రవారం ఆ తండ్రి–కొడుకులను చంపేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఘటన ఎన్నికలకు సంబంధం లేదని తేలింది. బాధితుడి నిశ్చితార్థం రెండు రోజుల్లో జరగాల్సి ఉందని అర్రా సదర్ ఎస్‌డీపీఓ రాజ్‌కుమార్ సహ తెలిపారు. ఇక మరో ఘటనలో మోకామా ప్రాంతంలో ఎన్నికల ప్రచార సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి జనసురాజ్ అనుచరుడు దులర్ చంద్ యాదవ్ మృతి చెందాడు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తేజస్వీ ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. 40 కాన్వాయ్ వాహనాల్లో ఆయుధాలతో తిరుగుతుంటే ఎన్నికల సంఘం, పరిపాలన ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు.
