
అర్జెంటీనా మధ్యంతర ఎన్నికల్లో మైలీ పార్టీ ఘన విజయం
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మైలీ పార్టీ 'లా లిబర్టాడ్ అవాంజా’ మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాలను అర్జెంటీనాలో మైలీ రాడికల్ సంస్కరణల అజెండాపై ప్రజాభిప్రాయ సేకరణగా పరిగణించారు. ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలను వాషింగ్టన్, వాల్ స్ట్రీట్ అత్యంత నిశితంగా గమనించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మైలీ పార్టీ అనూహ్యంగా 40 శాతానికి పైగా ఓట్లను సాధించి, ప్రధాన ప్రతిపక్షమైన పెరోనిస్ట్ కూటమిని (దాదాపు 31 శాతం) అధిగమించింది. ఈ విజయం కారణంగా మైలీ బృందం సెనేట్‌లో 14 సీట్లు, దిగువ సభలో 64 సీట్లు (మైలీ పార్టీ, మిత్రపక్షాల ద్వారా) అదనంగా సాధించింది.
ఈ బలమైన మద్దతు మైలీకి తన ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లడానికి కాంగ్రెస్‌లో సరిపడా బలాన్ని సమకూర్చింది. ఇకపై ఆయన అధ్యక్ష వీటోలను నిలబెట్టుకోవడానికి, ప్రతిపక్షం ప్రయత్నించే అభిశంసన ప్రయత్నాలను నిరోధించడానికి అవసరమైన మద్దతు లభించింది.
మైలీ విజయం వెనుక ట్రంప్ ప్రభావం
ఈ ఎన్నికలు వాషింగ్టన్ దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా జోక్యం చేసుకోవడం. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న అర్జెంటీనాకు ట్రంప్ సర్కార్ నుంచి 40 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సహాయం (బెయిలౌట్) అందింది. మైలీకి ఎన్నికల్లో మంచి ఫలితం వస్తేనే ఈ ఆర్థిక సాయం కొనసాగుతుందని, లేకపోతే సాయాన్ని వెనక్కి తీసుకుంటామని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు. "మైలీ గెలిస్తే మేము అతడితో ఉంటాం, లేదంటే మేము వెళ్ళిపోతాం" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.
ఈ ఆర్థిక సహాయం, దాంతో పాటు ట్రంప్ నుండి లభించిన బలమైన రాజకీయ మద్దతు.. ముఖ్యంగా ఎన్నికల ముందు మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తొలగించడంలో మైలీకి ఎంతగానో ఉపయోగపడింది.
ట్రంప్ బహిరంగ మద్దతును ప్రతిపక్షం 'విదేశీ జోక్యం'గా విమర్శించినప్పటికీ, ఎన్నికల ఫలితాలు మైలీకి అనుకూలంగా రావడంతో, ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా "మైలీ అద్భుతమైన పని చేస్తున్నారు. అర్జెంటీనా ప్రజలు మా విశ్వాసాన్ని సమర్థించారు" అని కొనియాడారు. మైలీ కూడా ట్రంప్‌ను "అర్జెంటీనాకు గొప్ప స్నేహితుడు" అని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మైలీకి ట్రంప్ మద్దతు ఇవ్వడం లాటిన్ అమెరికా కీలక వనరుల కోసం జరుగుతున్న విస్తృత భౌగోళిక రాజకీయ పోటీలో ఒక భాగమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
లిథియం వనరులు: ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలు అర్జెంటీనాలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఇది కీలకమైన భాగం. ఈ వనరులకు చైనా కంపెనీలకు కాకుండా, అమెరికన్ కంపెనీలకు ప్రాధాన్యత ఉండేలా వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది.
ఎగుమతులు: అర్జెంటీనా సోయాబీన్స్ భారీ మొత్తంలో ఎగుమతి చేస్తుంది. ట్రంప్ చైనాపై సుంకాలు విధించిన తర్వాత, చైనా తన సోయాబీన్ దిగుమతులను అమెరికా నుంచి అర్జెంటీనాకు మార్చింది. మైలీ వాషింగ్టన్ అనుకూల విధానాలు ఈ ధోరణిని తిప్పికొట్టి, పరోక్షంగా అమెరికా ఎగుమతిదారులకు లాభం చేకూర్చవచ్చు.
మైలీ ప్రతిజ్ఞ
ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం అధ్యక్షుడు మైలీ తన పార్టీ ప్రధాన కార్యాలయంలో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ విజయం.. దశాబ్దాల పతనం నుంచి అర్జెంటీనా బయటపడుతుందనడానికి నిదర్శనమన్నారు. "అర్జెంటీనా ప్రజలు 100 సంవత్సరాల పతనాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు" అని మైలీ ఉద్ఘాటించారు. "నేడు మనం మలుపు తిరిగాం. నేటి నుంచి గొప్ప అర్జెంటీనా నిర్మాణాన్ని ప్రారంభిస్తాం" అని ఆయన ప్రకటించారు. ట్రంప్ "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" నినాదాన్ని ప్రతిధ్వనించేలా మాట్లాడారు.
ఈ విజయం ద్వారా మైలీ ప్రభుత్వం తన అజెండా అయిన ఉద్యోగాల కోత, సబ్సిడీల తగ్గింపు, పన్ను, కార్మిక సంస్కరణలను వేగవంతం చేయాలని యోచిస్తోంది. అయితే ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గినప్పటికీ కఠినమైన పొదుపు చర్యల కారణంగా జీవన వ్యయాలు పెరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజల సహనాన్ని ఈ సంస్కరణలు ఎంతవరకు తట్టుకుంటాయో వేచి చూడాలి.
