Let's talk: editor@tmv.in
అర్జెంటీనా పర్యటనకు భారత మహిళా హాకీ జట్టు ప్రకటన

అర్జెంటీనా పర్యటనకు భారత మహిళా హాకీ జట్టు ప్రకటన

Shaik Mohammad Shaffee
9 ఏప్రిల్, 2026

రాబోయే ప్రతిష్టాత్మక ప్రపంచకప్, ఆసియా క్రీడలే లక్ష్యంగా భారత మహిళా హాకీ జట్టు కీలక పర్యటనకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 17 వరకు అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా జరిగే నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కోసం 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. అనుభవం, యువత కలగలిసిన ఈ జట్టుకు స్టార్ మిడ్‌ఫీల్డర్ సలీమా టెటే నాయకత్వం వహించనుంది. ప్రపంచ స్థాయి జట్లలో ఒకటైన అర్జెంటీనాతో తలపడటం ద్వారా భారత క్రీడాకారిణులు అంతర్జాతీయ అనుభవాన్ని గడించేందుకు ఇది గొప్ప అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీనియర్ల రాకతో పెరిగిన బలం

ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ స్టార్ ప్లేయర్ల పునరాగమనం. గాయం కారణంగా గత కొన్ని టోర్నీలకు దూరమైన స్టార్ ఫార్వర్డ్, ప్రధాన డ్రాగ్ ఫ్లికర్ దీపిక తిరిగి జట్టులోకి చేరడం భారత్‌కు పెద్ద ఊరట. ఆమె గైర్హాజరీలో నవనీత్ కౌర్, మనీషా చౌహాన్, ఉదిత, అన్ను వంటి వారు బాధ్యతలు నెరవేర్చినప్పటికీ, దీపిక రాకతో జట్టు సమతూకం పెరిగింది. అలాగే వెటరన్ గోల్ కీపర్ సవిత కూడా తిరిగి జట్టులోకి చేరింది. సవిత లేని సమయంలో యువ కీపర్ బిచ్చు దేవి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా, ఇప్పుడు వీరిద్దరి కలయికతో భారత గోల్ పోస్ట్ వద్ద పటిష్టమైన రక్షణ లభించనుంది. డిఫెండర్ జ్యోతి, ఫార్వర్డ్ ముంతాజ్ ఖాన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

యువ కెరటాల జోరు

ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులకు కోచ్ షోర్డ్ మరినే పెద్దపీట వేశారు. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న బల్జీత్ కౌర్, వైష్ణవి విఠల్ ఫాల్కే తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. వీరితో పాటు రుతుజా దాదాసో పిసల్, ఇషిక, సాక్షి రాణా వంటి వర్ధమాన క్రీడాకారిణులు అర్జెంటీనా వంటి బలమైన జట్టుపై సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. జట్టును మరింత పటిష్టం చేయడంతో పాటు, వివిధ కాంబినేషన్లను పరీక్షించేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని చీఫ్ కోచ్ మరినే ఆశాభావం వ్యక్తం చేశారు.

షెడ్యూల్ వివరాలు

భారత్, అర్జెంటీనా జట్ల మధ్య ఏప్రిల్ 13, 14, 16, 17 తేదీల్లో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు) ఈ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

భారత జట్టు సభ్యులు:

గోల్ కీపర్లు:

సవిత, బిచ్చు దేవి.

డిఫెండర్లు:

నిక్కీ ప్రధాన్, ఇషిక చౌదరి, సుశీల చాను, మనీషా చౌహాన్, లాల్తాంట్లువంగి, జ్యోతి, ఉదిత.

మిడ్ ఫీల్డర్లు:

వైష్ణవి, సాక్షి రాణా, సునేలిత తోప్పో, సలీమా టెటే (కెప్టెన్), నేహా, దీపిక సోరెంగ్, రుతుజా పిసల్, ఇషిక.

ఫార్వర్డ్స్:

బల్జీత్ కౌర్, నవనీత్ కౌర్, దీపిక, అన్ను, బ్యూటీ డంగ్ డంగ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్.