
అర్జెంటీనాలో అకాంకాగువా శిఖరాన్ని అధిరోహించిన భారత పర్వతారోహకులు
భారత పర్వతారోహణ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. దక్షిణ అమెరికాలోనే అత్యంత ఎత్తైన, ఆసియా వెలుపల ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా పేరొందిన అర్జెంటీనాలోని 'మౌంట్ అకాంకాగువా' (6,961 మీటర్లు)ను భారత పర్వతారోహకుల బృందం విజయవంతంగా అధిరోహించింది. ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 2:10 గంటలకు ఈ బృందం అకాంకాగువా శిఖరాగ్రంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.
శిఖరారోహణ సాగిందిలా..
ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్, పహల్గామ్‌లోని జవహర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ & వింటర్ స్పోర్ట్స్‌ల నుంచి ఎంపికైన ఆరుగురు సభ్యుల సంయుక్త బృందం ఈ సాహసాన్ని పూర్తి చేసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 5న ఈ బృందాన్ని జెండా ఊపి సాగనంపగా, ఫిబ్రవరి 8న వారు అర్జెంటీనా చేరుకున్నారు. అకాంకాగువా శిఖరాన్ని అధిరోహించే ముందు, ప్రాథమిక శిక్షణలో భాగంగా బృందం 5,050 మీటర్ల ఎత్తున్న 'బోనెట్ పీక్'ను అధిరోహించి, అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకున్నారు.
ప్రతికూల సవాళ్లను అధిగమిస్తూ..
ఈ యాత్ర ఆశామాషీగా సాగలేదు. మైనస్ 20 నుంచి మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన గాలులను లెక్కచేయకుండా బృందం ముందుకు సాగింది. శిఖరాగ్రం చేరుకోవడంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ చారిత్రాత్మక యాత్రకు ఎన్‌ఐఎం, జెఐఎం&డబ్ల్యూఎస్ ప్రిన్సిపాల్ కల్నల్ హేమ్ చంద్ర సింగ్ నాయకత్వం వహించారు. ఈ బృందంలో కెప్టెన్ జి. సంతోష్ కుమార్ (డిప్యూటీ లీడర్), దీప్ బహదూర్ సాహి, వినోద్ గుసాయ్, నాయబ్ సుబేదార్ భూపేందర్ సింగ్, హవల్దార్ రమేష్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.
భారత్ సత్తా ప్రపంచానికి చాటిన వైనం
అకాంకాగువా విజయం భారతీయ పర్వతారోహణ నైపుణ్యాలకు, దృఢ సంకల్పానికి ఒక నిదర్శనంగా నిలిచింది . ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ "ఈ అసాధారణ విజయం భారత పర్వతారోహణ సంస్థల ప్రపంచ స్థాయి శిక్షణ ప్రమాణాలకు నిదర్శనం. యువతకు, రక్షణ దళాల సిబ్బందికి ఈ సాహసం గొప్ప స్ఫూర్తినిస్తుంది" అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సాహస క్రీడల్లో భారతదేశం తన ఉనికిని మరింత బలంగా చాటుకుంటోందని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
