
అరుణాచల్‌లో ముగిసిన కయాకింగ్ ఛాంపియన్‌షిప్:హాజరైన కిరెన్ రిజిజు
అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ప్రవహించే తవాంగ్‌చు నదిపై ఆరు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ కయాకింగ్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. టిబెట్ నుంచి వచ్చే రెండు ఉపనదులు భూటాన్ మీదుగా బ్రహ్మపుత్రలో కలిసే ఈ నది తీరంలో ఈ పోటీలు నిర్వహించడం విశేషం. తవాంగ్‌చు టైడ్స్ ఇంటర్నేషనల్ కయాకింగ్ ఛాంపియన్‌షిప్ (టీటీఐకేసీ)–II ముగింపు వేడుకలో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తన ప్యాడ్లింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన భారత కయాకర్లు శిఖా చౌహాన్, భూమి బఘేల్ వరుసగా తొలి రెండు స్థానాలు సాధించగా, మేఘాలయకు చెందిన ఎలిజబెత్ విన్సెంట్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న రిజిజు, అరుణాచల్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
చాలా ఆనందం కలిగించింది
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫేమఖండు మాట్లాడుతూ, ఈ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకలో కనిపించిన ఉత్సాహం, ఆనందం కలిగించిందన్నారు. కయాకింగ్‌లో పాల్గొన్న తొలి కేంద్ర మంత్రిగా రిజిజు నిలిచారని పేర్కొన్నారు. క్రీడలపై ఆయనకున్న ఆసక్తి, క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంలో పట్టుదల, రాష్ట్రంలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఇండియన్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ (ఐకేసీఏ), అరుణాచల్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ (ఏకేసీఏ) కృషితో భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభావంతులైన క్రీడాకారులు మెరవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
రిజిజు ‘ఎక్స్’లో చేసిన పోస్టులో, “తవాంగ్‌చు టైడ్స్ ఇంటర్నేషనల్ కయాకింగ్ ఛాంపియన్‌షిప్ 2026 ముగింపు కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉంది. తవాంగ్‌లోని బోంగ్లెంగ్-ఖారుంగ్-లుంగ్లా ప్రాంతం అడ్వెంచర్ క్రీడలు, పర్యావరణ పర్యాటకానికి అద్భుత గమ్యం” అని పేర్కొన్నారు.
ఐకేసీఏ చైర్‌పర్సన్ బిల్కీస్ మీర్ మాట్లాడుతూ, తవాంగ్ జిల్లాలోని ఖురుంగ్, బోంగ్లింగ్ వంటి సరిహద్దు గ్రామాల్లో నిర్వహించిన ఈ పోటీలు స్థానికంగా మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటక రాకపోకలు పెరగడానికి దోహదపడ్డాయని తెలిపారు. మొదటి ఎడిషన్ విజయవంతమైన నేపథ్యంలో రెండోసారి నిర్వహించిన ఈ ఛాంపియన్‌షిప్ మరింత విస్తృతంగా, పోటీతత్వంగా సాగింది. అరుణాచల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐకేసీఏ, ఏకేసీఏ, అరుణాచల్ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. సముద్ర మట్టానికి 10,000 అడుగులకుపైగా ఎత్తులో ఉన్న తవాంగ్ ప్రాంతంలో ప్రధాన నది తవాంగ్‌చు. ఇది చైనా సరిహద్దుకు సమీపంలో ఉంది. టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంతో భారత్‌కు 1,129 కి.మీ.ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) ఉంది. ఆసియాలోని అత్యంత ప్రాచీన బౌద్ధ మఠాలలో ఒకటైన తవాంగ్ మఠం (1680లో స్థాపితం) ఇక్కడే ఉంది. ఆరవ దలైలామా సాంగ్యాంగ్ గ్యాట్సో తవాంగ్‌లో జన్మించారు.
