Let's talk: editor@tmv.in
అరుంధతి రెడ్డికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

అరుంధతి రెడ్డికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

Shaik Mohammad Shaffee
24 మార్చి, 2026

భారత మహిళా క్రికెట్ జట్టు మీడియం పేసర్ అరుంధతి రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఫిబ్రవరి నెలకు గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ఆమె గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అరుంధతి కనబరిచిన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఈ అవార్డు వరించేలా చేసింది. కంగారూల గడ్డపై భారత జట్టు 2-1తో చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అరుంధతి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ముఖ్యంగా 4/22, 2/30, 2/35 గణాంకాలతో సగటున 10.87 పరుగులకే వికెట్ తీస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

ఈ అవార్డుపై అరుంధతి రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ.. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడంలో తన వంతు సహకారం అందించడం గర్వంగా ఉందన్నారు. రాబోయే మహిళా టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఈ విజయం జట్టులో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు పురుషుల విభాగంలో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శన చేసిన ఆయన, ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టారు. నమీబియా, శ్రీలంక జట్లపై సెంచరీలు బాది, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే సీజన్‌లో రెండు శతకాలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు.

సాహిబ్‌జాదా ఫర్హాన్ ఫిబ్రవరి నెలలో ఆడిన ఏడు టీ20 మ్యాచ్‌ల్లో ఏకంగా 383 పరుగులు సాధించారు. 76.60 సగటుతో పాటు 160.25 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించి అనేకమంది దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరిలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించగా, మార్చిలో జరిగిన సెమీఫైనల్, ఫైనల్ వంటి నాకౌట్ మ్యాచ్‌ల ప్రదర్శనను తదుపరి నెల అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటామని ఐసీసీ తెలిపింది.