
అరావళి నిర్వచనంపై సుప్రీం బ్రేక్
అరావళి కొండలు–పర్వత శ్రేణుల నిర్వచనంపై గత నెలలో ఇచ్చిన కీలక ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలపివేసింది. నవంబర్ 20న ఇచ్చిన తీర్పులోని ఏకరీతి నిర్వచనాన్ని ఇచ్చిన ఆదేశాలను తాత్కలికంగా నిలుపుతున్నట్లు (అబేయన్స్‌లో) సోమవారం ప్రకటించింది. ఈ అంశంలో పలు సందేహాలు, స్పష్టత అవసరమని పేర్కొంటూ ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసును విచారించిన వేకేషన్ బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జె.కె. మహేశ్వరి, ఆగస్టిన్ జార్జ్ మసీహ్ ఉన్నారు. ఈ వ్యవహారం ‘ఇన్ రీ: డెఫినిషన్ ఆఫ్ అరావళి హిల్స్ అండ్ రేంజెస్ అండ్ ఆంక్సిలరీ ఇష్యూస్' పేరిట సుమోటోగా కొనసాగుతోంది. నవంబర్ 20న ఇచ్చిన తీర్పులో కమిటీ సిఫారసులు, కోర్టు ఇచ్చిన దిశానిర్దేశాలపై ప్రస్తుతం అమలు నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో మరింత లోతైన పరిశీలన అవసరమని, అందుకే గత తీర్పులోని సూచనలు, కమిటీ సిఫారసులను తాత్కాలికంగా అబేయన్స్‌లో ఉంచుతున్నామని బెంచ్ వ్యాఖ్యానించింది.
కేంద్రం, రాష్ట్రాలకు నోటీసులు
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి, అలాగే అరావళి పరిధిలోని రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 21కు వాయిదా వేసింది.
నవంబర్ 20 తీర్పు ఏమిటి?
ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత వ్యవస్థలలో ఒకటైన అరావళి శ్రేణి పరిరక్షణ లక్ష్యంగా నవంబర్ 20న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పులో అరావళి కొండలు, పర్వత శ్రేణులకు ఏకరీతి నిర్వచనాన్ని ఆమోదించింది. నిపుణుల నివేదికలు వచ్చే వరకు కొత్త గనుల లీజుల మంజూరుపై నిషేధం విధించింది. ఈ నిర్వచనం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా రూపొందింది.
అరావళి కొండల నిర్వచనం
కమిటీ సిఫారసుల ప్రకారం అరావళి జిల్లాల్లో ఉన్న స్థానిక భూభాగం కంటే 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భూభాగం అరావళి కొండగా పరిగణించాలని, అలాగే ఆ కొండకు సంబంధించిన వాలులు, చుట్టుపక్కల భూభాగాలు, అనుబంధ భూభాగాలు అన్నీ కూడా అరావళి కొండల్లో భాగమేనని పేర్కొంది. 500 మీటర్ల పరిధిలో ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ కొండలను కలిపి అరావళి పర్వత శ్రేణిగా పరిగణించాలని కమిటీ సూచించింది ఈ కొండల మధ్య ఉన్న భూభాగం, హిలాక్స్, వాలులు, అనుబంధ భూభాగాలు కూడా అరావళి శ్రేణిలో భాగమని స్పష్టం చేసింది.
నేపథ్యం
ఈ సుమోటో కేసు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి దీర్ఘకాలంగా కొనసాగుతున్న టి.ఎన్. గోదావర్మన్ తిరుముల్పాడ్ కేసు నుంచి ఉద్భవించింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నవంబర్ 20న 29 పేజీల తీర్పును వెలువరించింది.
అరావళి పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్
అరావళి పర్వత శ్రేణి నిర్వచనంపై గతంలో ఇచ్చిన తన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ స్వాగతించారు. అరావళి పర్వతాల రక్షణ, పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఎక్స్ లో చేసిన పోస్టులో అరావళి శ్రేణిపై సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను నిలిపివేసి, కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం స్వాగతించదగింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని భూపేంద్ర యాదవ్ తెలిపారు. కొత్త గనుల లీజులు లేదా పాత లీజుల పునరుద్ధరణపై పూర్తిస్థాయి నిషేధం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రజల భావాలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉద్యమాలు చేశారు. ఈ నిర్ణయం ప్రజల విజయమే అని ఆయన వ్యాఖ్యానించారు.
