
అరావళి నిర్వచనంపై నిపుణుల కమిటీకి పేర్లు సూచించండి: సుప్రీం
పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు ఇతర పక్షాలకు అరావళి కొండలు, శ్రేణుల నిర్వచనాన్ని ఖరారు చేయనున్న నిపుణుల కమిటీ కోసం ఆయా రంగ నిపుణుల పేర్లు సూచించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. ఈ ప్రాంతంలో కేవలం చట్టబద్ధమైన గనుల తవ్వకాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. గత డిసెంబర్ 29న అరావళి నిర్వచనంపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, నవంబర్ 20న ఇచ్చిన ఏకరీతి నిర్వచనాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, గనుల కార్యకలాపాలపై స్టే విధించింది.
100 మీటర్ల ఎత్తు ప్రమాణం, రెండు కొండల మధ్య 500 మీటర్ల దూరం వంటి ప్రమాణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాంతం పర్యావరణ రక్షణ నుంచి తప్పించే ప్రమాదం ఉందని కోర్టు గమనించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం (జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలి సభ్యులుగా) పూర్వపు స్టేను కొనసాగించింది. చట్టబద్ధమైన గనుల తవ్వకాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిర్వచనాన్ని నిపుణులే సూచించాలని సీజేఐ వ్యాఖ్యానించారు. పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిపుణుల ప్యానెల్‌కు సంబంధించిన ప్రొఫైళ్లతో కూడిన జాబితా సమర్పించాలని కోర్టు కోరింది. అలాగే సీనియర్ న్యాయవాదులు కూడా నిపుణుల పేర్లు సూచించాలని తెలిపింది. అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ అడ్వకేట్ కె. పరమేశ్వర్ ఇప్పటికే కోర్టుకు సహకరిస్తున్నారు.
లైసెన్సుతో గనులు నిర్వహిస్తున్న సంస్థల కార్యకలాపాలు కూడా నిలిచిపోయిన విషయం కోర్టు గమనించినప్పటికీ, ప్రాథమిక అంశాలు దశలవారీగా పరిష్కరించే వరకు యథాతథ పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. అరావళి నిర్వచనంపై అమికస్ క్యూరీ సూచనలు సమర్పించిన తర్వాత, సంబంధిత పక్షాలు మార్చి 10లోగా తమ రాతపూర్వక వాదనలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, నిర్ణయించాల్సిన అంశాలను ఖరారు చేస్తామని తెలిపింది. అంతకుముందు, పర్యావరణవేత్తల ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొత్త నిర్వచనంలో నియంత్రణ లోపాలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. 2025 నవంబర్ 20న అరావళి ప్రాంతాలకు సంబంధించిన ఏకరీతి నిర్వచనాన్ని ఆమోదిస్తూ, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తాజా గనుల లీజుల మంజూరును నిషేధించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత శ్రేణిగా గుర్తింపు పొందిన అరావళి వ్యవస్థ పర్యావరణ సమతౌల్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు.
