
అరావళి నిపుణుల కమిటీకి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం
అరావళి పర్వత శ్రేణులకు ఒక నిర్వచనం రూపొందించేందుకు ప్రతిపాదించిన 10 సభ్యుల నిపుణుల కమిటీ పేర్లపై కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమాచారం అందిస్తూ, కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సూచించిన సభ్యులతో ఉన్న హై పవర్డ్ కమిటీ ఏర్పాటు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ కమిటీలో చేర్చేందుకు తమవద్ద అదనపు పేర్లు లేవని కూడా స్పష్టం చేసింది. ఈ నిపుణుల కమిటీకి అధ్యక్షురాలిగా కంచన్‌దేవీను ప్రతిపాదించారు. ఆమె ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1991 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అయిన ఆమెకు అటవీ విద్య, పరిశోధన, వన్యప్రాణి సంరక్షణ, అటవీ విధానాల రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
ఈ కమిటీలో ఇతర సభ్యులుగా
• అశుతోష్ సుభాశ్ (మాజీ డైరెక్టర్ జనరల్,ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా)
• రాజేంద్ర కుమార్ శర్మ(మాజీ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా )
• తేజల్ కనిత్కార్ (క్లైమేట్, ఎనర్జీ పాలసీ నిపుణురాలు)
• జయ ప్రకాశ్ యాదవ్ (జీవ శాస్త్ర పరిశోధకుడు)
• తేజ్‌బీర్ సింగ్ రానా (సీనియర్ భూగోళ శాస్త్రవేత్త)
• ఎస్‌వీ సింగ్ (మాజీ అదనపు సర్వేయర్ జనరల్, సర్వే ఆఫ్ ఇండియా )
• సీఎన్.పాండే (మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, గుజరాత్)
• ధర్మేంద్ర ప్రకాశ్ (మాజీ పీసీసీఎఫ్, నాగాలాండ్)
అలాగే రచయిత ఆర్‌ఎన్.మిశ్రా, పర్యావరణ పునరుద్ధరణ నిపుణుడు విజయ్ దస్మానా పేర్లను కూడా కేంద్ర సాధికార కమిటీ సూచించింది. అరావళి పర్వత శ్రేణులకు సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి స్పష్టమైన నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యావరణ శాఖ కోర్టుకు తెలిపింది. ఫిబ్రవరి 26న జరిగిన విచారణలో అరావళి పర్వతాలకు నిర్వచనం రూపొందించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే చట్టబద్ధమైన మైనింగ్ కార్యకలాపాలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, నవంబర్ 20న ఇచ్చిన ఆదేశాల ప్రకారం అరావళి పర్వతాలకు ఒకే విధమైన నిర్వచనాన్ని అంగీకరించిన నిర్ణయాన్ని డిసెంబర్ 29న సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్త నిర్వచనంపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా 100 మీటర్ల ఎత్తు ప్రమాణం, పర్వతాల మధ్య 500 మీటర్ల దూరం వంటి ప్రమాణాల వల్ల అరావళి పర్వత శ్రేణిలోని పెద్దభాగం పర్యావరణ రక్షణ నుంచి బయటపడే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అరావళి పర్వత శ్రేణి దేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటిగా గుర్తించింది. ఇది ప్రధానంగా రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
