
అరావళి కొండలను కాపాడాలి: అజయ్ మాకెన్
ఉత్తర, వాయువ్య భారతదేశాన్ని ఎడారిగా మారకుండా కాపాడే గ్రీన్ వాల్ అయిన అరావళి కొండలు పెను ప్రమాదంలో పడ్డాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అజయ్ మాకెన్ సోమవారం హెచ్చరించారు. నవంబర్లో సుప్రీం కోర్టు అరావళి కొండలు, పర్వత శ్రేణులకు ఏకరూప నిర్వచనం ఆమోదించింది. దాని ప్రకారం స్థానిక ఉపరితలం నుంచి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఏ భూస్వరూపాన్నైనా ‘అరావళి కొండ’గా పరిగణిస్తారు. 500 మీటర్ల దూరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అలాంటి కొండలు ఉంటే వాటిని అరావళి పర్వత శ్రేణి గా చూస్తారు.
డస్ట్ బౌల్ గా మారుతుంది
ఈ నిర్వచనం అమలైతే రాజస్థాన్‌లోని 99 శాతం అరావళి కొండలు, హర్యానాలోని పెద్ద భాగం కూడా రక్షణ కోల్పోతాయని మాకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అరావళి కొండలు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనవి. ఇవి హైడ్రాలజీ పరంగా అత్యంత విలువైనవి. ఈ శిలల్లో నీరు ఇనుమడించే ప్రత్యేక గుణం ఉంది. ఒక్కో హెక్టారుకు సంవత్సరానికి సుమారు 20 లక్షల లీటర్ల మంచినీటిని భూగర్భంలోకి చేరుస్తాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి జిల్లాలకు ఇవే ఏకైక మంచినీటి వనరులు అని వివరించారు. కానీ ఈ 100 మీటర్ల నిర్వచనం వల్ల చాలా తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ పర్యావరణపరంగా, భూగర్భ జల పునర్భరణ పరంగా కీలకమైన అరావళి శ్రేణులు చట్టబద్ధంగా గనులు, రియల్ ఎస్టేట్‌కు అనుకూలంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిర్వచనం ఇలాగే కొనసాగితే ఉత్తర భారతదేశం మొత్తం ధూళి గిన్నె (డస్ట్ బౌల్)గా మారే ప్రమాదం ఉంది. థార్ ఎడారి తూర్పుదిశగా విస్తరిస్తుంది, ఢిల్లీకి వచ్చే ధూళి తుఫానులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ నివేదిక వచ్చేంతవరకు కొత్త మైనింగ్ లీజులపై నిషేధం విధించింది (2026లో నివేదిక అంచనా). కానీ రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు ఇప్పటికే 100 మీటర్ల కంటే తక్కువ ఆరావళి భూములను డీ-నోటిఫై చేయడం మొదలుపెట్టాయి.
ఉపసంహరించుకోవాలి
100 మీటర్ల ప్రమాణాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. 2003–2009 మధ్య ఉపగ్రహ చిత్రాలు, భూవైజ్ఞానిక శాస్త్రం ఆధారంగా గతంలో గుర్తించిన అరావళి ప్రాంతాలను మళ్లీ రక్షణలోకి తీసుకురావాలి. ఈ విషయంలో ఇస్రో, సీఏజడ్ఆర్ఐ, టీఈఆర్‌ఐ, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఐఐటీ ఢిల్లీ వంటి సంస్థలు చేసిన అన్ని స్వతంత్ర్య అధ్యయనాలూ మాకెన్ వాదనకు మద్దతుగా ఉన్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ కూడా అరావళి కొండలపై ఓ పత్రికలో వ్యాసం రాశారు.
