Let's talk: editor@tmv.in
అరావళి కొండలకు కేంద్రం ‘మరణ శాసనం’: సోనియాగాంధీ

అరావళి కొండలకు కేంద్రం ‘మరణ శాసనం’: సోనియాగాంధీ

Pinjari Chand
4 డిసెంబర్, 2025

పర్యావరణ పరిరక్షణ విషయంలోలో చాలా అత్యంత దుర్మార్గమైన, క్రూరమైన ధోరణి ని ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అరావళి పర్వత శ్రేణులకు ఇప్పటికే దాదాపు “మరణ శిక్ష” ఖరారు చేసినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 1980 అటవీ (సంరక్షణ) చట్టంలో ప్రభుత్వం బలవంతంగా పార్లమెంటులో ఆమోదించిన సవరణలను, అలాగే అటవీ సంరక్షణ నియమావళి-2022ను వెంటనే ఉపసంహరించాలని ఆమె డిమాండ్ చేశారు. అరావళి శ్రేణిలో 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న కొండలను కూడా తవ్వుకొవడానికి ప్రభుత్వం మినహాయింపునివ్వడం చాలా దారుణమైనమైన నిర్ణయం అని వాపోయారు.

దీంతో అక్రమ మైనింగ్ మాఫియాకు ఓపెన్ గా ఆహ్వానం పంపినట్లేనని, దీని వల్ల అరావళి శ్రేణిలో 90 శాతం భాగం నాశనమవుతుందని సోనియా ఘాటుగా విమర్శించారు. గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా వరకు సాగే అరావళి పర్వత శ్రేణి భారత భూగోళ చరిత్రలో కీలక పాత్ర పోషించింది. థార్ ఎడారి నుంచి మైదాన ప్రాంతాలకు ఎడారీకరణ వ్యాప్తిని అడ్డుకుంది, చిత్తోర్‌గఢ్, రణథంభోర్ వంటి గొప్ప కోటలను కాపాడింది. వాయువ్య భారత సమాజాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందని ఆమె ఓ పత్రికలో ప్రచురితమైన వ్యాసంలో రాశారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ కొండలకు మరణ శిక్ష వేస్తోంది. అక్రమ గనులతో ఇప్పటికే నిర్వీర్యమైన ఈ పర్వత శ్రేణిని పూర్తిగా నాశనం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మోతాదుకు మించి యూరేనియం

ఢిల్లీలో ప్రతి సంవత్సరం ఇదే సమయంలో మంచు ధూళి కాలం మొదలవుతుందని, ధూళి-పొగ-కాలుష్య కణాలతో నిండిన గాలిని పీల్చుకుంటూ ప్రజలు జీవిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ కాలుష్యం వల్ల ఒక్క 10 నగరాల్లోనే సంవత్సరానికి 34 వేల మంది మరణిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర భూగర్భ జల మండలి నివేదిక ప్రకారం ఢిల్లీలో పరీక్షించిన భూగర్భ జల నమూనాల్లో 13-15 శాతం మోతాదుకు మించి యూరేనియం ఉందని , పంజాబ్-హర్యానాలో ఇది మరింత ఎక్కువగా ఉందని ఆమె విశ్లేషించారు.

గత దశాబ్దంలో భారత్‌ను చుట్టుముట్టిన పర్యావరణ సంక్షోభానికి ఇవన్నీ కారణాలు, పరిణామాలు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత దుర్మార్గమైన ధోరణిని ప్రదర్శిస్తోందని ఆమె మండిపడ్డారు. అటవీ సంరక్షణ (సవరణ) చట్టం-2023 ద్వారా భారీ ఎత్తున అడవులను ఇతర ప్రయోజనాలకు మళ్లించేందుకు అనుమతులు సులభం చేశారని, 2020 ఈఐఏ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రజా విచారణలను బలహీనపరిచిందని, తీరప్రాంత నియమావళి-2018తో సున్నిత తీర ప్రాంతాలను రియల్ ఎస్టేట్, పరిశ్రమలకు అనుకూలంగా మార్చేశారని ఆరోపించారు. రాజకీయంగా అనుకూలంగా ఉన్నప్పుడు అడవులను కాపాడుతున్న స్థానిక ఆదివాసీ సమాజాలను పర్యావరణానికి వ్యతిరేకంగా చూపిస్తోందని విమర్శించారు. అటవీ హక్కుల చట్టం-2006 కారణంగానే అడవులు నాశనమవుతున్నాయని కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని, టైగర్ రిజర్వుల నుంచి 65 వేల కుటుంబాలను బలవంతంగా తరలించాలని కోరడం చట్ట విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి

పర్యావరణానికి కొత్త ఒడంబడిక అవసరం. ముందుగా మరింత నష్టం జరగకుండా ఆపాలి. గ్రేట్ నికోబార్, హస్దేవ్ అరణ్య, ధీరౌలి అడవుల్లో జరుగుతున్న భారీ అటవీ నిర్మూలనను ఆపాలి. అరావళి, పశ్చిమ కనుమల్లో అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. హిమాలయాల్లో కొండలను నిర్దాక్షిణ్యంగా పేల్చివేయడం ఆపాలని సోనియా డిమాండ్ చేశారు. గత దశాబ్దంలో ప్రవేశపెట్టిన పర్యావరణ వ్యతిరేక చట్ట సవరణలను సమీక్షించి, అటవీ సంరక్షణ చట్టం-1980, నియమావళి-2022 సవరణలను వెంటనే ఉపసంహరించాలని, ఆదివాసీల సమ్మతి లేకుండా అడవులను నరికివేసేందుకు అనుమతించే నిబంధనలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన పెద్ద కార్పొరేట్ కంపెనీలకు తర్వాత ఎక్స్‌పోస్ట్ ఫాక్టో అనుమతులు ఇచ్చే ఈ దుష్ట ఆలోచనను నిలిపివేయాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

అరావళి కొండలకు కేంద్రం ‘మరణ శాసనం’: సోనియాగాంధీ - Tholi Paluku