Let's talk: editor@tmv.in
అరబ్ దేశాలతో భారత్ చారిత్రక బంధం.. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం

అరబ్ దేశాలతో భారత్ చారిత్రక బంధం.. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం

Shaik Mohammad Shaffee
2 ఫిబ్రవరి, 2026

భారత్-అరబ్ దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండవ భారత్-అరబ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరు వర్గాలు 'న్యూఢిల్లీ డిక్లరేషన్'ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనాలని, ఇజ్రాయెల్‌తో కలిసి శాంతియుతంగా జీవించే స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు కావాలని ఉమ్మడిగా ఆకాంక్షించాయి. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, అరబ్ లీగ్ దేశాల మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించారు.

పాలస్తీనాకు అండగా నిలుస్తాం: ప్రధాని మోడీ

ఈ సమావేశం సందర్భంగా అరబ్ దేశాల ప్రతినిధి బృందంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. "అరబ్ దేశాలతో భారత్‌కు శతాబ్దాల నాటి అనుబంధం ఉంది. పాలస్తీనా ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఆయన, రాబోయే కాలంలో వాణిజ్యం, పెట్టుబడులు, విద్యుత్, టెక్నాలజీ, వైద్య రంగాల్లో సంబంధాలను మరింత పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అరబ్ లీగ్ శాంతి ప్రయత్నాలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

అంతర్జాతీయ శాంతికి ఉగ్రవాదమే అతిపెద్ద ముప్పు అని సమావేశం అభిప్రాయపడింది. ఉగ్రవాదం విషయంలో 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరించాలని తీర్మానించాయి. పహల్గామ్‌లో భారత పర్యాటకులపై జరిగిన దాడిని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాద సంస్థలు డ్రోన్లు, ఆధునిక టెక్నాలజీని వాడుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన నేతలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాలం చెల్లిన పద్ధతులను మార్చాలని, ప్రపంచ వాస్తవికతకు అద్దం పట్టేలా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రూ. 42 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యం

ప్రస్తుతం భారత్-అరబ్ దేశాల మధ్య దాదాపు 240 బిలియన్ డాలర్ల (రూ.20 లక్షల కోట్లు) వాణిజ్యం జరుగుతోంది. దీనిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.42 లక్షల కోట్లు) చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంతో పాటు, విదేశీ కరెన్సీపై ఆధారపడకుండా స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారం చేసుకునే వీలుపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోనున్నారు.

అంతరిక్షం, టెక్నాలజీలో కొత్త అడుగులు

చమురు, గ్యాస్ వంటి సంప్రదాయ రంగాల నుంచి భారత్-అరబ్ బంధం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత వైపు మళ్లుతోంది. 2027లో తొలిసారిగా 'భారత్-అరబ్ స్పేస్ కోఆపరేషన్ వర్కింగ్ గ్రూప్'ను ఏర్పాటు చేసి, వ్యవసాయం, విపత్తు నిర్వహణలో శాటిలైట్ సేవలను వినియోగించుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. దీంతో పాటు హెల్త్-టెక్, ఫిన్-టెక్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌ను రూపొందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉమ్మడి పరిశోధనలకు పెద్దపీట వేస్తూ, సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా కొత్త అడుగులు వేస్తున్నాయి.

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలపై చర్చ

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా భారత్, అరబ్ నేతలు సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, యెమెన్ భద్రతకు విఘాతం కలిగించే చర్యలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీల దాడులను తీవ్రంగా ఖండించిన నేతలు, అంతర్జాతీయ నౌకాయాన భద్రతను కాపాడటం అందరి బాధ్యతని స్పష్టం చేశారు. అలాగే లిబియా, సూడాన్, సోమాలియా దేశాల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యం ఉండకూడదని, ఆ దేశాల ఐక్యత, సమగ్రతను కాపాడటం ద్వారానే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమని ముక్తకంఠంతో చాటారు.

90 లక్షల మంది భారతీయులే మా వారధి: జైశంకర్

అరబ్ దేశాల్లో నివసిస్తున్న 90 లక్షల మందికి పైగా భారతీయులు ఇరు ప్రాంతాల మధ్య ఒక 'సజీవ వారధి'గా ఉన్నారని మంత్రి జైశంకర్ కొనియాడారు. వారి సంక్షేమం కోసం అరబ్ దేశాలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కేవలం చమురుకే పరిమితం కాకుండా రాబోయే మూడేళ్ల కోసం (2026-2028) ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. దీని ప్రకారం 2026లో పర్యాటకం, వైద్య రంగాలపై సదస్సులు, 2027లో కొత్త కంపెనీల (స్టార్టప్) ప్రోత్సాహానికి, అంతరిక్ష పరిశోధనలపై కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. చివరగా 2028లో మూడవ మంత్రి స్థాయి సమావేశం జరగనుంది. ఈ ప్రణాళిక ద్వారా భారత్-అరబ్ బంధం మరింత పటిష్టం కానుంది.