Let's talk: editor@tmv.in
అయోధ్య విరాళాల వ్యవహారంపై భద్రాచలంలో వి. హనుమంతరావు మౌనదీక్ష

అయోధ్య విరాళాల వ్యవహారంపై భద్రాచలంలో వి. హనుమంతరావు మౌనదీక్ష

Gaddamidi Naveen
14 జులై, 2026

అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణపై వెలువడుతున్న ఆరోపణలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి. హనుమంతరావు (వీహెచ్) ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న ఆయన, అనంతరం ఆలయం సమీపంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన మౌనదీక్షలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వి.హెచ్ మాట్లాడుతూ, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విరాళాలు అందించారని, ఆ నిధుల వినియోగంపై పూర్తి పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విరాళాల లెక్కల విషయంలో నకిలీ రసీదులు, నగదు కానుకల నిర్వహణలో లోపాలు, ఆర్థిక అక్రమాలపై వరుసగా ఆరోపణలు వస్తున్నప్పటికీ సమగ్ర విచారణ జరగడం లేదని విమర్శించారు. అవకతవకలకు సంబంధించి కేవలం దిగువ స్థాయి ఉద్యోగులపైనే చర్యలు తీసుకుంటున్నారని, అసలు బాధ్యులుగా ఉన్న ఉన్నతస్థాయి వ్యక్తులపై ఎందుకు విచారణలు జరపడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే ఈ అంశంపై బీజేపీ నైతిక బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని వీహెచ్ పేర్కొన్నారు. అయోధ్య విరాళాల వ్యవహారంపై నిరసనగా జూలై 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌనదీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

ట్యాగ్‌లు
BhadrachalamVHanumanthaRaoAyodhyaRamMandirRamMandirCongressRahulGandhiPriyankaGandhiJantarMantarTelanganaPoliticsPoliticalNews
అయోధ్య విరాళాల వ్యవహారంపై భద్రాచలంలో వి. హనుమంతరావు మౌనదీక్ష - Tholi Paluku