
అయోధ్యలో చంద్రబాబు పర్యటన - రామ మందిరంలో ప్రత్యేక పూజలు
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరాన్ని సందర్శించి బాలరాముడిని దర్శించుకున్న ఆయన, ఆలయ విశిష్టతను కొనియాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అయోధ్య ధామం భారత దేశానికి అగ్రగామి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవబోతోందని ఆకాంక్షించారు. రామరాజ్య స్థాపనలో పాటించిన ఆదర్శాలే నేటి కాలంలో ఉత్తమ పాలనకు దిక్సూచీలు అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత సాకారమైన ఈ అద్భుత కట్టడం వెనుక ఉన్న ప్రతి ఒక్కరి కృషిని అభినందిస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నిరంతర కృషికి లభించిన ఫలితం
శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం ఒక చారిత్రక విజయమని, దీని వెనుక ఎంతో కష్టం దాగి ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ క్షేత్రం రూపుదిద్దుకోవడం అంత సులభంగా జరగలేదని కోర్టు విచారణలు, సుదీర్ఘ చర్చలు అన్ని వర్గాల సమన్వయంతోనే తుది నిర్ణయం వెలువడిందని వివరించారు. ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదని భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చూపే శక్తి కేంద్రమని అభివర్ణించారు. రాబోయే రెండేళ్లలో ఈ ఆలయం దేశంలోని ఇతర దేవాలయాలకు ఒక ప్రామాణికంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో రాష్ట్రం వేగంగా మార్పు చెందుతోందని చంద్రబాబు ప్రశంసించారు. తమ పర్యటనకు సహకరించిన యూపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ 'వికసిత్ భారత్–2047' లక్ష్యాన్ని చేరుకోవడంలో యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక వృద్ధి కూడా తోడైనప్పుడే దేశం బలోపేతం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంలో ఇటీవల తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో తాను చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో స్థిరపడి, అత్యధిక తలసరి ఆదాయంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. భారత్ భవిష్యత్తులోనూ అగ్రగామిగా ఉండాలంటే జనాభా వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రస్తావించిన విధంగా దేశ భవిష్యత్తుకు మానవ శక్తియే ప్రధాన ఆధారమని జనాభా సమతుల్యతపై దృష్టి సారించడం ద్వారానే 2047 లక్ష్యాలను సాధించగలమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
