
అమ్రాబాద్ గిరిజనుల పునరావాసం.. లబ్ధిదారులకు రూ. 15 లక్షల చెక్కుల పంపిణీ
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల అభివృద్ధి, అటవీ, వన్యప్రాణుల సంరక్షణను సమన్వయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ లోపల ఉన్న గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు స్వచ్ఛంద పునరావాసం కల్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. బుధవారం అసెంబ్లీ కౌన్సిల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిసి 14 గిరిజన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
మొదటి దశలో భాగంగా నాలుగు గ్రామాల (సర్లాపల్లి, కుడిచింతలబైలు, తటిగుండాలపెంట, కొల్లంపెంట) నుంచి 417 కుటుంబాలను ఈ పునరావాస కార్యక్రమం కింద ఎంపిక చేశారు. వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం రూ. 62.55 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 24 కోట్లు నగదు పరిహారానికి, రూ. 38.55 కోట్లు గృహ నిర్మాణానికి వినియోగిస్తున్నారు. గిరిజన కుటుంబాల కోరిక మేరకు ప్రభుత్వం రెండు రకాల ఎంపికలను అందించింది.160 కుటుంబాలు ఒక్కొక్కరు రూ. 15 లక్షల నగదు పరిహారాన్ని ఎంచుకున్నాయి. 257 కుటుంబాలకు నాగర్‌కర్నూల్ జిల్లాలోని బాచారం వద్ద 5 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఆధునిక వసతులతో కూడిన ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఇది కేవలం ఇళ్ల మార్పిడి కాదు, గిరిజనుల జీవితాల్లో వస్తున్న పెను మార్పు అని అభివర్ణించారు. బాచారంలో నిర్మిస్తున్న పునరావాస కాలనీని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. అక్కడ రోడ్లు, తాగునీరు, విద్యుత్, ఆధునిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షణ
ఈ పునరావాస ప్రక్రియ వల్ల సుమారు 1,501 హెక్టార్ల అటవీ భూమి పునరుద్ధరణకు గురవుతుంది. దీనివల్ల పులులు ఇతర వన్యప్రాణులకు మెరుగైన ఆవాసం లభించి, వాటి జనాభా పెరగడానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా రూ. 15 లక్షల పరిహారం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమంలో గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని మంత్రులు పునరుద్ఘాటించారు.
