
అమ్మాయిలను బయటకు పంపరాదు: సీఎం మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గాపూర్‌లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ అత్యాచారం ఘటన గురించి తెలిసిన వెంటనే నేను షాక్ కు గురయ్యాను. కళాశాలలో చదువుకునే వారిని రాత్రి సయమంలో బయటకు పంపకూడదని, వాళ్లు తమను తామే రక్షించుకోవాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా విద్యార్థులకు భద్రతను కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రభుత్వం వీరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఆయా ప్రభుత్వాలు ఏం చేశాయి
మూడు వారాల కింద ఒడిశాలోని బీచ్ లో మూడు అత్యాచార ఘటనలు జరిగాయి. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందని ఒడిశా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే మణిపూర్, యూపీ, బీహార్, ఒడిశాలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నాయి అని మమతా ప్రశ్నించారు.
దుర్గాపూర్ అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని పై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ సంఘటనలో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురిని ఆదివారం అరెస్ట్ చేశారు. వీరిని కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అసన్ సోల్–దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ డీసీపీ అభిషేక్ గుప్తా మాట్లాడుతూ కేసును మమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. తదుపరి విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. బాధిత వైద్య విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి; కాంగ్రెస్
బాధితురాలికి సత్వరం న్యాయం చేయాలని, అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేగంగా దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ కోరారు.ఒడిశా ప్రభుత్వం కూడా బెంగాల్ సర్కార్ తో కేసు విషయంలో చర్చలు జరపాలని కోరారు. బాధిత విద్యార్థి ఒడిశాలోని జలేశ్వర్ ప్రాంత నివాసులు కావడంతో ప్రభుత్వం బెంగాల్ అధికారులకు సహకరించాలని చెప్పారు.
ఆర్జీకర్ ఘటనలో నిందితుడికి జీవిత ఖైదు
2024 ఆగష్టు 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజ్‌లో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. వైద్యుల భద్రతపై తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వం కూడా వేగంగా దర్యాప్తు చేసింది. కానీ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈకేసులో పోలీస్ సివిక్ వాలంటీర్ గా పనిచేసే సంజయ్ రాయ్ ని నిందితుడిగా గుర్తించారు. అతని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది. అలాగే ఆర్జీకే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ స్టేషన్ అధికారియైన అభిజిత్ మండల్ ను అరెస్ట్ చేశారు.
