Let's talk: editor@tmv.in
అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా చమురు నౌకలో ముగ్గురు భారతీయులు!

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా చమురు నౌకలో ముగ్గురు భారతీయులు!

Shaik Mohammad Shaffee
10 జనవరి, 2026

అట్లాంటిక్ మహాసముద్రంలో అమెరికా కోస్ట్ గార్డ్ దళాలు స్వాధీనం చేసుకున్న రష్యా చమురు ట్యాంకర్ 'మెరినెరా' (గతంలో బెల్లా-1)లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, వారిలో 17 మంది ఉక్రెయిన్ వాసులు, ఆరుగురు జార్జియా పౌరులు, ముగ్గురు భారతీయులు, ఇద్దరు రష్యా పౌరులు ఉన్నట్లు రష్యా మీడియా సంస్థలు వెల్లడించాయి.

అమెరికా చర్యను రష్యా విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. అంతర్జాతీయ సముద్రయాన చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా "వలసవాద" ధోరణితో వ్యవహరిస్తోందని మాస్కో మండిపడింది. అంతర్జాతీయ జలాల్లో శాంతియుతంగా ప్రయాణిస్తున్న పౌర నౌకపై సైనిక బలగాలను ప్రయోగించడం చట్టవిరుద్ధమని రష్యా స్పష్టం చేసింది. ఈ నౌక రష్యా పోర్టుకు వెళ్తోందని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలను తాము ముందే అమెరికాకు అందించామని, అయినా బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఏంటని రష్యా ప్రశ్నిస్తోంది.

ఈ వ్యవహారంపై అమెరికా చెబుతున్న కారణాలను రష్యా పూర్తిగా కొట్టిపారేసింది. వెనిజులా సహజ వనరులను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికే అమెరికా ఇలాంటి కఠినమైన చర్యలకు పాల్పడుతోందని మాస్కో మండిపడింది. తమ దేశ చట్టాలను సాకుగా చూపి, అంతర్జాతీయ జలాల్లో వేరే దేశానికి చెందిన నౌకలను బలవంతంగా ఆపడం సముద్ర నిబంధనలకు విరుద్ధమని రష్యా హెచ్చరించింది. నౌకలోని సిబ్బందిని మానవత్వంతో గౌరవించాలని, వారి ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా వెంటనే స్వదేశానికి పంపాలని అమెరికాను డిమాండ్ చేసింది.

ప్రస్తుతం ఈ నౌక అమెరికా దళాల అదుపులో ఉంది. అందులో ఉన్న భారతీయుల క్షేమ సమాచారం కోసం భారత విదేశాంగ శాఖ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాగా ఈ పరిణామాలు అమెరికా-రష్యాల మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇది రెండు అగ్రరాజ్యాల మధ్య పెను దౌత్య యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.