
అమెరికా శాంతి ప్రణాళికపై జెనీవాలో హైటెన్షన్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే పేరుతో అమెరికా తీసుకొచ్చిన నూతన శాంతి ప్రణాళికపై పశ్చిమ దేశాల్లో కలకలం రేగింది. జెనీవాలో ఆదివారం ప్రారంభమైన కీలక చర్చల్లో ఉక్రెయిన్‌కు తోడుగా యూరప్ దేశాలు కూడా ఈ ప్రణాళిక రష్యా కోరికల జాబితా లాంటిదే అన్న సందేహాన్ని బహిర్గతం చేశాయి. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యదర్శి ఆండ్రియ్ యెర్మాక్ నేతృత్వంలోని బృందం మొదటిగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమైంది. అమెరికా ప్రతిపాదించిన 28 పాయింట్ల బ్లూప్రింట్‌లో రష్యాకు పూర్తిగా అనుకూలంగా ఉన్న అంశాలు ఉన్నాయన్న అభిప్రాయం ఈ దేశాలన్నింటిలోనూ నెలకొంది.
శాంతికి కట్టుబడి ఉన్నాం - యెర్మాక్, ఉక్రెయిన్ ప్రతినిధి
ఉక్రెయిన్ ప్రతినిధి బృందం అధిపతి, అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ యెర్మాక్ సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం మరుసటి భేటీ అమెరికా ప్రతినిధులతో స్థిరమైన, న్యాయమైన శాంతి కోసం కలిసి పనిచేస్తున్నాం అని అన్నారు.ఈ చర్చలకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కోల్, ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విడ్కాఫ్ హాజరుకానున్నారు.
ఉక్రెయిన్ భూభాగం ఇచ్చేయాలా? సైన్యంపై పరిమితులా
అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాలను రష్యాకు అప్పగించాలి.ఉక్రెయిన్ సైన్యంపై పలు పరిమితులు ఉండాలి అన్న నిబంధనలు ఉన్నాయని సమాచారం. ఇవి ఉక్రెయిన్‌కు పూర్తిగా అంగీకార యోగ్యం కాని విషయాలే.
ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఎన్నోసార్లు ఉక్రెయిన్ తన భూభాగాన్ని ఎప్పటికీ వదులుకోదు అని స్పష్టంచేశారు. దీనిపైనే మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి భంగం - ఫ్రాన్స్
ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి అలిస్ రూఫో మాట్లాడుతూ అమెరికా తీసుకొచ్చిన శాంతి ప్రణాళికలో ఉక్రెయిన్ ఆర్మీపై ఉంచిన పరిమితులు ఇవన్నీ దాని సార్వభౌమత్వాన్ని కుదించే అంశాలే అని వ్యాఖ్యానించారు. రష్యా ఇది వరకూ ఎన్నోసార్లు యుద్ధం చేసింది. ఉక్రెయిన్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది. దానిని ఎవరూ అడ్డుకోలేరు అని స్పష్టం చేశారు.
ఇది ప్రతిపాదన కాదు - ట్రంప్
శనివారం వైట్ హౌస్ వెలుపల వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ అమెరికా ప్రతిపాదన తన చివరి ప్రతిపాదన కాదని అన్నారు. నేను శాంతిని కోరుకుంటున్నాను. ఇది చాలా కాలం క్రితమే జరిగి ఉండాలి. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడూ జరిగి ఉండకూడదు అని ట్రంప్ అన్నారు. ఏదో ఒక విధంగా, మనం దానిని ముగించాలి. ఆ ప్రణాళిక తన చివరి ప్రతిపాదన కాకపోవడం ద్వారా తాను ఏమి చెబుతున్నాడో ట్రంప్ వివరించలేదు. స్పష్టత కోసం చేసిన అభ్యర్థనకు వైట్ హౌస్ స్పందించలేదు.
అసలు ఈ ప్రణాళిక ఎవరిది? పోలాండ్
పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టుస్క్ కూడా ప్రణాళికపై మండిపడ్డారు. యూరప్, కెనడా, జపాన్‌తో కలిసి చర్చించడానికి సిద్ధం. కానీ ముందుగా ఇది ఎవరి ప్రణాళిక? ఎక్కడ తయారైంది? తెలియాలి అని అన్నారు.
సెనేటర్ల ఆరోపణ
అమెరికా సెనేటర్ల బృందం శనివారం మాట్లాడుతూ రూబియో మాకు చెప్పింది—ఈ ప్రణాళిక అమెరికా ప్రభుత్వ ప్రతిపాదన కాదు. రష్యా ‘విష్ లిస్ట్’ లా ఉంది అని పేర్కొన్నారు. అయితే వెంటనే అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ దీనిని పూర్తిగా అబద్ధం అని ఖండించింది. తరువాత రూబియో కూడా ఆన్‌లైన్‌లో స్పందిస్తూ, సెనేటర్లు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని సూచించారు. ఇలా అమెరికా అంతర్గతంగా ఇచ్చిన విభిన్న సంకేతాలతో ప్రణాళికపై ఇంకా పెద్ద సందేహాలు అలాగే ఉన్నాయి.
