Let's talk: editor@tmv.in
అమెరికా మద్దతుతో ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ భీకర దాడులు

అమెరికా మద్దతుతో ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ భీకర దాడులు

Dantu Vijaya Lakshmi Prasanna
1 మార్చి, 2026

శనివారం మధ్యాహ్నం వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్ వైమానిక దళం పట్టపగలే ఈ దాడులకు తెగబడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయానికి సమీపంలోనే మొదటి పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నగరం నడిబొడ్డున దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ దాడి సమయంలో 86 ఏళ్ల ఖమేనీ కార్యాలయంలో ఉన్నారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.

అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం

ఈ సైనిక చర్యలో అమెరికా కూడా పాలుపంచుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చలు విఫలం కావడం, అమెరికా ఒత్తిడికి ఇరాన్ లొంగకపోవడంతో ఈ దాడులు జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా యుద్ధ విమానాలు, నౌకాదళం ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా దళాలు ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

కీలక లక్ష్యాలే టార్గెట్

ఇజ్రాయెల్ ఈ దాడుల్లో కేవలం మిలిటరీ స్థావరాలనే కాకుండా, ఇరాన్ ప్రభుత్వ చిహ్నాలు, ఇంటెలిజెన్స్ విభాగాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ రాజధానిలోని కీలక భవనాలు, కమ్యూనికేషన్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీయడం, అణు కార్యక్రమానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ఈ దాడి ప్రధాన ఉద్దేశ్యమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు.

అణు చర్చల వైఫల్యం

ఇరాన్ తన యురేనియం శుద్ధీకరణను ఆపాలని, సుదూర శ్రేణి క్షిపణుల తయారీని విరమించుకోవాలని అమెరికా కోరుతోంది. అయితే, అణు శక్తిని శాంతియుత అవసరాల కోసం వాడుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ మొండికేస్తోంది. హమాస్, హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇవ్వడం కూడా అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఆగ్రహం కలిగిస్తోంది. దేశీయంగా నిరసనలతో ఇబ్బంది పడుతున్న ఇరాన్‌ను దెబ్బతీయడానికి ఇదే సరైన సమయమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఇరాన్ ప్రతిస్పందన, హెచ్చరికలు

దాడుల అనంతరం ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేసింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేసింది. వెంటనే వాటిపై క్షిపణులతో దాడి ప్రారంబించింది. అయితే, ఇప్పటి వరకు ప్రాణనష్టానికి సంబంధించి తమ పౌరులు 50 మందికి పైగా చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాలను మూసివేసి, ప్రజలను బంకర్లలోకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

మీ ప్రభుత్వాన్ని మీరు స్వాధీనం చేసుకోండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలకు సంచలన పిలుపునిస్తూ, తమ ప్రభుత్వాన్ని తామే స్వయంగా హస్తగతం చేసుకోవాలని కోరారు. ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్‌లో అమెరికా కూడా 'భారీ పోరాట కార్యకలాపాలను' ప్రారంభించిందని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ అణు ఆయుధ ప్రయత్నాలు అమెరికాను చేరుకోగల క్షిపణి వ్యవస్థల తయారీ దృష్ట్యా ఈ దాడులు తప్పనిసరని, దీన్ని ఒక "ఉత్తమ లక్ష్యం" అని ఆయన అభివర్ణించారు. అదే సమయంలో ఇరాన్ అధికారులు తక్షణమే ఆయుధాలు వదిలి లొంగిపోవాలని, లేదంటే "ఖచ్చితమైన మరణాన్ని" ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

అంతర్జాతీయ ఆందోళన

ఈ పరిణామం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన ఈ ప్రత్యక్ష యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయాలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు ఇప్పటికే అత్యవసర స్థితిని ప్రకటించి, శస్త్రచికిత్సలను భూగర్భ గదుల్లోకి మార్చాయి. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే మధ్యప్రాచ్యం మొత్తం యుద్ధక్షేత్రంగా మారే ప్రమాదం ఉంది. చమురు ధరలపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.