
అమెరికా భారత్‌ను దాదాపు కొనేసింది: సంజయ్‌రౌత్
భారత్–అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ట్రేడ్ డీల్‌తో అమెరికా భారత్‌ను దాదాపు కొనేసినట్లే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో 50 శాతంగా ఉన్న టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించడాన్ని ప్రస్తావించిన రౌత్, ఈ ఒప్పందం వల్ల భారత రైతుల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ ధరలకు భారత మార్కెట్లోకి రావడం వల్ల దేశీయ రైతులు నష్టపోతారని ఆయన అన్నారు. ఈ ట్రేడ్ డీల్‌ను విజయం అంటున్నారు. కానీ ఇది ఎలా విజయం? గతంలో 3 శాతం టారిఫ్ ఉండగా, ఇప్పుడు 18 శాతం ఖరారు చేశారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులపై 0 శాతం టారిఫ్ విధించనున్నారు. ధాన్యాలు, పండ్లు, పాడి ఉత్పత్తులు అన్నీ ఇందులో ఉన్నాయి. మన రైతులు రాత్రింబగళ్లు కష్టపడి పంటలు పండిస్తే, అమెరికా తన ఉత్పత్తులను తక్కువ ధరలకు మన మార్కెట్లో అమ్ముతుంది. అప్పుడు మన రైతుల పరిస్థితి ఏమిటి? వారు ఆత్మహత్యలకు పాల్పడాలా? ఇది దేశాన్ని అమ్మేసినట్లే అని రౌత్ వ్యాఖ్యానించారు.
భారత్–అమెరికా ట్రేడ్ ఒప్పందంలో భాగంగా భారత ఉత్పత్తులపై టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. వ్యవసాయం, పాడి రంగాలను రక్షించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే, కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌ను సున్నాకి తగ్గించవచ్చని, అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు.
ఇదిలా ఉండగా, భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై ఈ వారంలో ఇరుదేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చర్చలు తుది దశలో ఉన్నాయి. ఈ వారం సంయుక్త ప్రకటన విడుదల కావొచ్చని ఒక అధికారి పేర్కొన్నారు. ట్రేడ్ డీల్ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి స్కాట్ బెసెంట్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమై సప్లై చైన్ భద్రతపై చర్చించారు. ఇదే సమయంలో, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయం, పాడి రంగాల ప్రయోజనాలను ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ వచ్చారని తెలిపారు. భారత్–అమెరికా ట్రేడ్ ఒప్పందంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యవసాయం, పాడి వంటి సున్నిత రంగాలకు పూర్తి రక్షణ కల్పించామని ఆయన స్పష్టం చేశారు.
