Let's talk: editor@tmv.in
అమెరికా ఫస్ట్: వర్క్ పర్మిట్లపై కఠిన చర్యలకు వైట్ హౌస్ సంకేతాలు

అమెరికా ఫస్ట్: వర్క్ పర్మిట్లపై కఠిన చర్యలకు వైట్ హౌస్ సంకేతాలు

Shaik Mohammad Shaffee
8 డిసెంబర్, 2025

అమెరికాలో ఉపాధి ఆధారిత వలస విధానాలపై వైట్ హౌస్ కఠిన చర్యలు ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న "అమెరికా ఫస్ట్" విధానంలో భాగంగా, వర్క్ పర్మిట్‌లను పరిమితం చేస్తూ, పరిశీలనా విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

ఈ విధానానికి అనుగుణంగా హెచ్ 1బీ వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన హెచ్-4 వీసాదారుల కోసం అమెరికా ప్రభుత్వం కొత్త, కఠినమైన నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం డిసెంబర్ 15 నుంచి హెచ్౧బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులందరికీ సోషల్ మీడియా అకౌంట్ల తనిఖీ తప్పనిసరి. వీసా మంజూరు ప్రక్రియలో పరిశీలన సులభతరం చేయడానికి, దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటినీ 'పబ్లిక్' సెట్టింగ్‌కు మార్చాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. ఈ నిబంధన ఎఫ్, ఎం, జే వంటి ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల దరఖాస్తుదారులకు కూడా వర్తిస్తుంది. అమెరికాలో ప్రవేశించడానికి వీసా పొందడం అనేది "ఒక హక్కు కాదు, ప్రత్యేక హక్కు" అని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. ప్రతి వీసా నిర్ణయం ఒక జాతీయ భద్రతా నిర్ణయమే అని, దరఖాస్తుదారులు దేశానికి హాని కలిగించకుండా ఉండేలా అమెరికా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ కొత్త విధానం భారతీయ నిపుణులలో ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో హెచ్ 1బీ వీసాపై పనిచేసేవారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు.

హెచ్ 1బీ ఫీజు పెంచిన ట్రంప్

హెచ్ 1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గతంలో కూడా కఠిన చర్యలు తీసుకుంది. సెప్టెంబర్‌లో కొత్త హెచ్ 1బీ వీసా దరఖాస్తులపై ఒక్కసారిగా 1,00,000 డాలర్ల రుసుము విధించడానికి సంబంధించిన ప్రకటన చేశారు. ఈ చర్య అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ నిపుణులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

19 దేశాల గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌ నిలుపుదల

వలస విధానాలలో మరింత కఠినతరం చేస్తూ అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ డీసీలో ఒక ఆఫ్ఘన్ పౌరుడు జరిపిన కాల్పుల సంఘటన తర్వాత, అమెరికా 19 "సమస్యాత్మక దేశాలకు" చెందిన పౌరుల గ్రీన్ కార్డ్, పౌరసత్వం, ఇతర వలస దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. యు.ఎస్. సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ జారీ చేసిన మెమో ప్రకారం, తదుపరి సమీక్ష పూర్తయ్యే వరకు అన్ని ఆశ్రయ అభ్యర్థనలను కూడా "నిలిపివేయాలని" అధికారులను ఆదేశించింది. ఈ సంఘటనలో ఒక అమెరికన్ సైనికురాలు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తి, 2021లో తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆఫ్ఘన్ పౌరుల కోసం ఏర్పాటు చేసిన 'ఆపరేషన్ అలైస్ వెల్‌కమ్' అనే కార్యక్రమం ద్వారా అమెరికాకు వచ్చినట్లు గుర్తించారు. ఈ చర్యలన్నీ జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అమెరికా వలస విధానాన్ని సమూలంగా మార్చే 'అమెరికా ఫస్ట్' నినాదంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటోంది.

అమెరికా ఫస్ట్: వర్క్ పర్మిట్లపై కఠిన చర్యలకు వైట్ హౌస్ సంకేతాలు - Tholi Paluku