
అమెరికా ప్రతినిధి బృందంతో తెలంగాణ సీఎస్ భేటీ
హైదరాబాద్‌లో పెట్టుబడుల విస్తరించేందుకు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో అమెరికా-భారత్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావును సచివాలయంలో కలుసుకుని వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించింది.
ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థిక వృద్ధి, పెట్టుబడి అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతినిధులకు వివరించారు. 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రంగా తెలంగాణ గత దశాబ్దంలో గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన తెలిపారు. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగాయని, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ పెట్టుబడులు దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని ఆయన చెప్పారు. రాష్ట్ర జనాభాలో సుమారు మూడవ వంతు మంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారని వివరించారు. హైదరాబాద్ ను దేశంలో ఫార్మా రాజధానిగా, అలాగే ఐటీ రంగంలో అగ్రగామి కేంద్రంగా అభివర్ణించారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్ల వారసత్వం, స్టార్టప్ ఎకోసిస్టమ్, ముఖ్యంగా రక్షణ రంగ స్టార్టప్‌ల అభివృద్ధికి దోహదపడిందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) విస్తృతంగా ఆకర్షితమవుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే ప్రఖ్యాత విద్యాసంస్థలు, ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, బలమైన ఫిన్‌టెక్ వ్యవస్థ రాష్ట్రానికి ప్రత్యేక బలం అందిస్తున్నాయని చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూల వాతావరణం, సమృద్ధిగా ఉన్న సాంస్కృతిక వారసత్వం, ప్రసిద్ధ వంటకాలు వంటి అంశాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని వివరించారు. రాష్ట్ర లక్ష్యం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ప్రతినిధులు మలాచీ బ్రియాన్ నుజెంట్, ఆర్ దీపక్ జోషి, దివ్‌దృష్టి సింగ్, పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీతో తెలంగాణ అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
