
అమెరికా పర్యటన షెడ్యూల్‌ను బహిర్గతం చేయాలి: ఎన్. రామచందర్‌రావు
అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు తప్పుబట్టారు. అమెరికా పర్యటనలో సీఎం ఎవరెవరిని కలవాలనుకున్నారు? ఆ భేటీల ఉద్దేశం ఏమిటీ? అనే వివరాలను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా దేశ ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రానికి సక్రమంగా అందించకుండా కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి అమెరికా, లండన్, సింగపూర్ పర్యటనలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. ఈసారి అనుమతి ఎందుకు లభించలేదో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలని సూచించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ తగిన సమాచారం అందించని సందర్భాల్లో పలువురు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరించిన ఉదాహరణలు ఉన్నాయని రామచందర్‌రావు పేర్కొన్నారు. విదేశీ పర్యటనలకు అనుమతులు విదేశాంగ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారమే మంజూరు చేస్తారని స్పష్టం చేశారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, గుజరాత్‌కు ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను కూడా ఆయన ఖండించారు. ఎన్డీయే ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని అన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వందేభారత్ రైళ్ల ప్రవేశం, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీబీనగర్‌లో ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులు కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని చెప్పారు.
అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై రేవంత్‌రెడ్డి సోమవారం కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నిర్ణయాన్ని నియంతృత్వ చర్యగా అభివర్ణిస్తూ, తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలను అవమానించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
