Let's talk: editor@tmv.in
అమెరికా నుంచి 3,800 మంది భారతీయుల బహిష్కరణ

అమెరికా నుంచి 3,800 మంది భారతీయుల బహిష్కరణ

Shaik Mohammad Shaffee
6 ఫిబ్రవరి, 2026

గత ఏడాది (2025) కాలంలో సుమారు 3,800 మందికి పైగా భారతీయ పౌరులను అమెరికా ప్రభుత్వం స్వదేశానికి బహిష్కరించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బహిష్కరణకు గురైన వారిలో మెజారిటీ వాషింగ్టన్ మీదుగా వచ్చినవారేనని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.

కాన్సులేట్ల వారీగా గణాంకాలు

గత ఏడాది డిసెంబర్ మధ్య నాటికి అందిన వివరాల ప్రకారం, మొత్తం 3,800 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. వీరిలో అత్యధికంగా 3,414 మందిని వాషింగ్టన్ నుంచే బహిష్కరించారు. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల (కాన్సులేట్ల) పరిధిలో ఈ బహిష్కరణలు జరిగాయి. హ్యూస్టన్ నుంచి 234 మంది, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి 49 మంది, న్యూయార్క్ నుంచి 47 మందిని వెనక్కి పంపారు. అలాగే అట్లాంటా, సియాటిల్ ప్రాంతాల నుంచి 31 మంది చొప్పున స్వదేశానికి చేరారు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వం అధికారికంగా పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది.

మానవీయ కోణం - సంకెళ్లపై అభ్యంతరం

భారతీయ పౌరులను బహిష్కరించే సమయంలో వారి పట్ల 'మానవీయంగా' వ్యవహరించాలని అమెరికా అధికారులతో నిరంతరం చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా బహిష్కరణకు గురయ్యే వారిలో మహిళలు, పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించడం, వారికి సంకెళ్లు వేయడం వంటి అంశాలపై భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని అమెరికా అధికారులకు రిజిస్టర్ చేసింది. బహిష్కరణకు ముందు సదరు వ్యక్తులు భారతీయ పౌరులేనని స్పష్టమైన ధృవీకరణ జరిగిన తర్వాతే ప్రక్రియ సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

‘డంకీ’ దందాలపై కొరడా

అక్రమంగా విదేశాలకు వెళ్లే ‘డంకీ రూట్’ దందాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. స్వదేశానికి తిరిగి వచ్చిన బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అక్రమ రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు, మానవ అక్రమ రవాణా సిండికేట్లపై పలు కేసులు నమోదయ్యాయి. అక్రమ ఏజెంట్లపై విచారణ వేగవంతంగా సాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. డిసెంబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా 3,505 మంది అనధికార ఏజెంట్లను గుర్తించి, వారి వివరాలను ‘ఈ-మైగ్రేట్’ పోర్టల్‌లో ఉంచినట్లు మంత్రి వివరించారు.

చట్టబద్ధమైన వలసలే శ్రేయస్కరం

విదేశాలకు వెళ్లే భారతీయ నిరుద్యోగుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. 1983 ఎమిగ్రేషన్ చట్టం ప్రకారం, కేవలం గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలని, దీనివల్ల మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని మంత్రి సూచించారు. ముఖ్యంగా 19 దేశాలకు ఉపాధి కోసం వెళ్లే 'ఈసీఆర్' పాస్‌పోర్ట్ కలిగిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి (క్లియరెన్స్) తీసుకోవాలి. నకిలీ ఏజెంట్లు, ఉద్యోగాల పేరుతో సాగే మోసాలపై సోషల్ మీడియా ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని, యువత అక్రమ మార్గాలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రభుత్వం హెచ్చరించింది.