Let's talk: editor@tmv.in
అమెరికా నుంచి భారత్‌కు మూడు పురాతన కాంస్య విగ్రహాలు!

అమెరికా నుంచి భారత్‌కు మూడు పురాతన కాంస్య విగ్రహాలు!

Shaik Mohammad Shaffee
31 జనవరి, 2026

దశాబ్దాల క్రితం భారత్ నుంచి అక్రమంగా తరలించబడిన అపురూప సాంస్కృతిక సంపద మళ్లీ మాతృభూమికి చేరుకోనుంది. తమిళనాడులోని ప్రాచీన ఆలయాలకు చెందిన మూడు అరుదైన కాంస్య విగ్రహాలను భారత్‌కు తిరిగి అప్పగించనున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న ప్రఖ్యాత 'స్మిత్‌సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్' ప్రకటించింది. మ్యూజియం పరిశోధక బృందం చేపట్టిన సమగ్ర పరిశోధనలో ఈ విగ్రహాలు చట్టవిరుద్ధంగా తరలించబడినట్లు స్పష్టమవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

విగ్రహాల నేపథ్యం

భారత్‌కు తిరిగి రానున్న ఈ మూడు విగ్రహాలు దక్షిణ భారత శిల్పకళా చాతుర్యానికి మచ్చుతునకలు. ఒకప్పుడు దేవాలయాల్లో నిత్య పూజలు అందుకుంటూ, ఉత్సవాల సమయంలో శోభాయమానంగా ఊరేగే ఈ పవిత్ర మూర్తుల మూలాలపై మ్యూజియం అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ నిశిత పరిశీలనలో క్రీ.శ.990 ప్రాంతానికి చెందిన చోళ కాలపు ‘శివ నటరాజు’, 12వ శతాబ్దపు ‘సోమస్కంద’, 16వ శతాబ్దపు విజయనగర కాలానికి చెందిన అరుదైన ‘సంత్ సుందరార్-పరవై’ విగ్రహాలు అక్రమంగా తరలించబడినట్లు స్పష్టమైంది. ఈ అపురూప శిల్పాలు భారతీయ సంస్కృతికి, ప్రాచీన లోహ శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి.

ఫోటో సాక్ష్యాలతో నిర్ధారణ

ఈ అపురూప విగ్రహాల మూలాలను వెలికితీయడంలో పాండిచ్చేరిలోని 'ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఫోటో ఆర్కైవ్స్' కీలక ఆధారాలను అందించింది. మ్యూజియం బృందం జరిపిన విచారణలో.. 1956 నుంచి 1959 మధ్య కాలంలో తమిళనాడులోని వివిధ ఆలయాల్లో ఈ విగ్రహాలు ఉన్నట్లు నాటి ఛాయాచిత్రాలు స్పష్టమైన సాక్ష్యాలను చూపిస్తున్నాయి. వీటి ఆధారంగా, భారత పురావస్తు శాఖ కూడా ఈ శిల్పాలు భారతీయ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా తరలించబడినవేనని అధికారికంగాధ్రువీకరించింది.

నకిలీ పత్రాల భాగోతం

ఈ పరిశోధనలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2002లో న్యూయార్క్‌లోని డోరిస్ వీనర్ గ్యాలరీ నుంచి మ్యూజియం కొనుగోలు చేసిన 'శివ నటరాజు' విగ్రహం కోసం సదరు గ్యాలరీ యాజమాన్యం నకిలీ పత్రాలను సృష్టించినట్లు పరిశీలనలో తేలింది. తంజావూరు శ్రీ భవ ఔషధేశ్వర ఆలయానికి చెందిన ఈ విగ్రహంతో పాటు, 1987లో బహుమతి రూపంలో అందిన అలత్తూర్ విశ్వనాథ ఆలయ 'సోమస్కంద', వీరసోలపురం శివాలయ 'సంత్ సుందరార్' విగ్రహాలు కూడా అక్రమ మార్గాల్లోనే అమెరికాకు చేరాయని నిర్ధారణ అయింది.

ఒక విగ్రహం అక్కడే.. దీర్ఘకాలిక ఒప్పందం

భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం ప్రకారం.. 'శివ నటరాజు' విగ్రహాన్ని దీర్ఘకాలిక రుణ ప్రాతిపదికన స్మిత్‌సోనియన్ మ్యూజియంలోనే కొనసాగించనున్నారు. తద్వారా ఆ విగ్రహం చరిత్ర, అక్రమ తరలింపు, తిరిగి భారత్‌కు అప్పగించిన ఉదంతాన్ని ప్రపంచవ్యాప్త సందర్శకులకు వివరించనున్నారు. మ్యూజియం డైరెక్టర్ చేస్ రాబిన్సన్ మాట్లాడుతూ.. సాంస్కృతిక వారసత్వాన్ని బాధ్యతాయుతంగా కాపాడటం తమ నైతిక బాధ్యతని పేర్కొన్నారు.

భారత రాయబార కార్యాలయం, మ్యూజియం అధికారులు ప్రస్తుతం విగ్రహాల అప్పగింత ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నారు. 1923లో ప్రారంభమైన ఈ మ్యూజియం, ఆసియా కళాఖండాల సంరక్షణలో ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనదిగా పేరుగాంచింది.

ద్వైపాక్షిక బంధానికి కొత్త ఊపు

ఈ విగ్రహాల అప్పగింత కేవలం కళాఖండాల పునరుద్ధరణ మాత్రమే కాదు, భారత్-అమెరికా సంబంధాల్లో ఒక నూతన మైలురాయి. భారత ఆందోళనలను గౌరవిస్తూ అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని, భావోద్వేగ అనుబంధాన్ని పెంచి 'సాంస్కృతిక దౌత్యాన్ని' బలపరుస్తుంది. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వారసత్వ పరిరక్షణకు, చట్టపాలనకు ఇది భరోసానిస్తుంది. ఫలితంగా, పురావస్తు పరిశోధన, మ్యూజియం నిర్వహణ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో మరింత సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది బలమైన పునాది వేస్తుంది.