Let's talk: editor@tmv.in
అమెరికా దాడి చేస్తే మధ్యప్రాచ్యంలో యుద్ధమే… ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక

అమెరికా దాడి చేస్తే మధ్యప్రాచ్యంలో యుద్ధమే… ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక

Shaik Mohammad Shaffee
2 ఫిబ్రవరి, 2026

ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే అది కేవలం రెండు దేశాల మధ్యనే కాకుండా మొత్తం మధ్యప్రాచ్యాన్ని కుదిపేసే ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఆదివారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న తరుణంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ట్రంప్ బెదిరింపుల నడుమ ఉద్రిక్తతలు

ఇరాన్‌లో ఇటీవల జరిగిన దేశవ్యాప్త నిరసనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్‌తో పాటు ఇతర యుద్ధ నౌకలను అరేబియా సముద్రానికి పంపింది. అయితే నిజంగా దాడి చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు.

“మేము యుద్ధం కోరుకోవడం లేదు”

ఖమేనీ మాట్లాడుతూ, “మేము ఎవరిపై దాడి చేయాలనుకోవడం లేదు. కానీ ఇరాన్‌పై ఎవరు దాడి చేసినా, వేధించినా, వారికి గట్టి సమాధానం తప్పదు” అని స్పష్టం చేశారు. అమెరికా యుద్ధాన్ని ప్రారంభిస్తే, ఈసారి అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఆయన అన్నారు.

నిరసనలపై ప్రభుత్వ కఠిన వైఖరి

ఇరాన్‌లో డిసెంబర్ 28 నుంచి మొదలైన నిరసనలు తొలుత ఆర్థిక సమస్యలపైనే సాగినప్పటికీ.. క్రమంగా అవి ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా మారాయి. ఈ పరిణామాలను ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక 'కుట్ర'గా అభివర్ణించారు. దేశాన్ని నడిపే కీలక కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగాయని.. పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, మసీదులను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ నిరసనల నేపథ్యంలో ఇప్పటికే వేలాది మందిని భద్రతా దళాలు నిర్బంధించాయి.

హార్ముజ్ సన్నాహాలు, చమురు రవాణాపై ఆందోళన

ఇదిలా ఉండగా, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ప్రత్యక్ష కాల్పుల సైనిక విన్యాసాలకు సిద్ధమైంది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వెళ్తుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ విన్యాసాల సమయంలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలగకూడదని హెచ్చరించింది.

యూరోపియన్ సైన్యాలపై ‘ఉగ్రవాద’ ముద్ర

మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖాలిబాఫ్ మరో సంచలన ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్ తమ విప్లవ గార్డ్ దళాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సైన్యాలను ఉగ్రవాద గుంపులుగా ఇరాన్ పరిగణిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం ఎక్కువగా ప్రతీకాత్మకమే అయినప్పటికీ, రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచింది.

పార్లమెంటులో నినాదాలు

ఈ ప్రకటన సందర్భంగా ఇరాన్ పార్లమెంట్ సభ్యులు రెవల్యూషనరీ గార్డ్స్ (విప్లవ దళాల) యూనిఫార్ములు ధరించి తమ మద్దతును ప్రకటించారు. అనంతరం 'అమెరికా నశించాలి', 'ఇజ్రాయెల్ నశించాలి' అంటూ నినాదాలు చేశారు. కాగా, ఈ రెవల్యూషనరీ గార్డ్స్ నేరుగా సుప్రీం లీడర్ ఖమేనీ పర్యవేక్షణలో, ఆయనకు మాత్రమే విధేయులుగా పనిచేస్తాయి.

అణు కార్యక్రమంపైనా ట్రంప్ దృష్టి

మరోవైపు, ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ చర్చలకు మొగ్గు చూపుతోందని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ప్రత్యక్ష చర్చల విషయంలో ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. మొత్తానికి, ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అక్కడ జరిగే చిన్న పొరపాటు కూడా పెను యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అమెరికా దాడి చేస్తే మధ్యప్రాచ్యంలో యుద్ధమే… ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరిక - Tholi Paluku