Let's talk: editor@tmv.in
అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త: మంత్రి అచ్చెన్నాయుడు

అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త: మంత్రి అచ్చెన్నాయుడు

Panthagani Anusha
4 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలోని ఆక్వా రైతులు, సముద్ర ఆహార ఎగుమతిదారులకు అమెరికా ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై గతంలో ఉన్న 25 శాతం టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా జరిగిన ఈ మార్పుతో రాష్ట్ర ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

పడిపోయిన ఎగుమతులకు పునర్వైభవం

గతంలో 25 శాతం సాధారణ టారిఫ్‌తో పాటు అదనపు శిక్షాత్మక టారిఫ్‌లు తోడవడంతో మొత్తం భారం 50 నుంచి 58 శాతం వరకు ఉండేదని మంత్రి గుర్తు చేశారు. దీని ప్రభావంతో 2025 ఏప్రిల్ - నవంబర్ మధ్య కాలంలో అమెరికాకు ఎగుమతులు భారీగా క్షీణించాయి. పరిమాణంలో 15 శాతం, విలువ పరంగా 6.3 శాతం మేర ఎగుమతులు పడిపోయి ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా టారిఫ్ తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో మన ఉత్పత్తులకు మళ్లీ పోటీతత్వం పెరుగుతుందని, నిలిచిపోయిన ఆర్డర్లు తిరిగి ప్రారంభమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

టారిఫ్ తగ్గింపుతో కేవలం ఎగుమతులు పెరగడమే కాకుండా ప్రాసెసింగ్ రంగంలోని లాభాల మార్జిన్లు కూడా మెరుగుపడతాయని మంత్రి వెల్లడించారు. గతంలో 5 శాతానికి పడిపోయిన ప్రాసెసర్ల మార్జిన్లు ఇకపై 7 నుంచి 8 శాతానికి చేరుతాయని అంచనా వేశారు. దీనికి తోడు కేంద్ర బడ్జెట్ - 2026లో ఆక్వా ఇన్‌పుట్స్‌పై ప్రకటించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి కొండంత అండగా నిలుస్తాయని ఆయన తెలిపారు. రాబోయే నెలల్లో అమెరికాకు ఎగుమతులు 10 నుంచి 15 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు దేశ సముద్ర ఆహార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ నిర్ణయం వరంలా మారుతుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అమెరికా మార్కెట్ పుంజుకోవడంతో పాటు యూరప్, చైనా, వియత్నాం, రష్యా వంటి దేశాలకు కూడా ఎగుమతులు స్థిరంగా సాగుతున్నాయని దీనివల్ల రాష్ట్రంలోని మత్స్యకారులు, ఆక్వా రైతులకు ఆదాయ స్థిరత్వం చేకూరుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్త ఎగుమతులు 15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.