Let's talk: editor@tmv.in
అమెరికా చర్యలతో నిలిచిన వెనిజువేలా చమురు ఎగుమతులు

అమెరికా చర్యలతో నిలిచిన వెనిజువేలా చమురు ఎగుమతులు

Pinjari Chand
14 డిసెంబర్, 2025

వెనిజువేలా తీరానికి సమీపంలో ఒక చమురు ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడం, అలాగే వెనిజువేలాతో వ్యాపారం చేస్తున్న షిప్పింగ్ కంపెనీలపై కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయి. నికోలాస్ మడురో ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు సైనిక ఒత్తిడి పెంచే చర్యలలో భాగంగా మరిన్ని నౌకలను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించడంతో, వెనిజువేలా జలాల్లోకి వచ్చే–వెళ్లే ఆయిల్ ట్యాంకర్‌ల కదలికలు దాదాపు నిలిచిపోయినట్లు వర్గాలు తెలిపాయి.

బుధవారం ‘స్కిప్పర్’ అనే ఆయిల్ ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడం 2019లో ఆంక్షలు విధించిన తర్వాత వెనిజువేలా చమురు సరుకుపై జరిగిన తొలి స్వాధీనం కావడం గమనార్హం. అదే సమయంలో కరీబియన్ సముద్ర ప్రాంతంలో అమెరికా సైనిక సమీకరణ పెరుగుతోంది. మడురో ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే సుమారు 1.1 కోట్ల బ్యారెళ్ల చమురు, ఇంధనంతో నిండిన అనేక ట్యాంకర్‌లు వెనిజువేలా జలాల్లోనే నిలిచిపోయాయి. అమెరికా స్వాధీనం భయంతో అవి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లడానికి వెనుకాడుతున్నాయి. అయితే అమెరికా చమురు దిగ్గజ సంస్థ షెవ్రాన్ అద్దెకు తీసుకున్న ట్యాంకర్‌లకు మాత్రమే మినహాయింపు లభించింది. అమెరికా ప్రభుత్వ అనుమతితో షెవ్రాన్, వెనిజువేలా ప్రభుత్వ చమురు సంస్థ పీడీవీఎస్ఏతో కలిసి జాయింట్ వెంచర్‌ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ తాజాగా రెండు వెనిజువేలా హెవీ క్రూడ్ ఆయిల్‌ను అమెరికాకు ఎగుమతి చేసినట్లు నిర్ధారించింది.

‘స్కిప్పర్’ ట్యాంకర్‌ను శుక్రవారం టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు తీసుకెళ్లి అందులోని ఇంధనాన్ని దించగా, అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాటిన్ అమెరికాలో మాదకద్రవ్య రవాణా లక్ష్యాలపై భూభాగ దాడులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. కొన్ని వారాలుగా కరీబియన్ సముద్రం, పసిఫిక్ మహాసముద్రాల్లో అమెరికా దళాలు నౌకలపై దాడులు చేస్తే సుమారు 90 మంది మరణించారని ట్రంప్ తెలిపారు. సముద్రమార్గంలో అమెరికాకు తరలించే డ్రగ్స్‌లో 96 శాతం అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, డ్రగ్ ట్రాఫికింగ్ నౌకలపై దాడులన్న అమెరికా వాదనకు ఎలాంటి ఆధారాలు చూపలేదని అంతర్జాతీయ న్యాయ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా చేపడుతున్న ఈ దాడులు న్యాయవ్యతిరేక హత్యలకే సమానమని వారు విమర్శిస్తున్నారు.