Let's talk: editor@tmv.in
అమెరికా కొత్త సుంకాల మోత.. దిగుమతులపై 10 శాతం అదనపు పన్ను

అమెరికా కొత్త సుంకాల మోత.. దిగుమతులపై 10 శాతం అదనపు పన్ను

Shaik Mohammad Shaffee
25 ఫిబ్రవరి, 2026

అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోకి వచ్చే దిగుమతి వస్తువులపై 10 శాతం అదనపు సుంకాన్ని విధిస్తూ మంగళవారం నుంచి అధికారికంగా అమలులోకి తెచ్చారు. గతంలో విధించిన సుంకాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పు రావడంతో, ట్రంప్ ఈ తాత్కాలిక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే వాస్తవానికి 15 శాతం పన్ను విధిస్తామని శనివారం ఆయన ప్రకటించినప్పటికీ, ప్రస్తుతానికి 10 శాతానికే పరిమితం కావడం గమనార్హం.

సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం

అమెరికా అధ్యక్షుడు విధించిన మునుపటి సుంకాలు రాజ్యాంగబద్ధం కావని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటిని విధించవచ్చని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో గతంలో ఉన్న 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉన్న సుంకాల వసూళ్లను నిలిపివేశారు. దీనికి బదులుగా ‘ 1974 ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 122 ' చట్టాన్ని ఉపయోగించి, దేశంలోని 1.2 ట్రిలియన్ డాలర్ల భారీ వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు ఈ కొత్త 10 శాతం సుంకాలను అమల్లోకి తెచ్చారు. ఈ సుంకాలు 150 రోజుల పాటు చెల్లుబాటు అవుతాయని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు తెలిపారు.

ఎందుకు 10 శాతమే?

సుంకాన్ని 15 శాతానికి పెంచుతానని ట్రంప్ స్వయంగా ప్రకటించినా, మంగళవారం నాటికి అది 10 శాతానికే అమలు కావడంపై ప్రపంచ దేశాల్లో గందరగోళం నెలకొంది. దీనిపై వైట్‌హౌస్ నుండి ఎటువంటి స్పష్టత లేదు. అయితే భవిష్యత్తులో ఈ పన్నును 15 శాతానికి పెంచే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. ఒకవేళ ఏవైనా దేశాలు అమెరికాతో గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల నుండి వెనక్కి తగ్గితే, మరింత కఠినమైన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.

అప్రమత్తమైన ప్రపంచ దేశాలు

ట్రంప్ తాజా నిర్ణయంతో జపాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ), బ్రిటన్ వంటి దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాము ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం తమకు అనుకూలమైన సుంకాలను కొనసాగించాలని జపాన్ కోరింది. అటు ఈయూ, బ్రిటన్ సైతం పాత ఒప్పందాలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాయి.

భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం

అమెరికా కొత్తగా విధించిన 10 శాతం సుంకాల వల్ల భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగి, పోటీతత్వం తగ్గవచ్చు. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, లెదర్, ఆటో విడిభాగాలు, స్టీల్ ఉత్పత్తులు ఎగుమతి చేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఐటీ, సాఫ్ట్‌వేర్, ఫార్మా వంటి సేవా రంగాలు ఈ సుంకాల పరిధిలోకి రాకపోవడంతో ఆయా రంగాలకు ఎటువంటి ప్రమాదం లేదు. సుప్రీంకోర్టు తీర్పుతో గతంలో ఉన్న భారీ సుంకాలు రద్దవ్వడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం 10 శాతం సుంకం అనేది తాత్కాలికమే కాబట్టి, భారత ప్రభుత్వం ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుని అమెరికాతో జరుపుతున్న వాణిజ్య చర్చల ద్వారా మరిన్ని మినహాయింపులు పొందే అవకాశం ఉంది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, మినహాయింపులు పొందినవి మినహా మిగిలిన అన్ని దిగుమతి వస్తువులు ఈ అదనపు పన్ను పరిధిలోకి వస్తాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై, ముఖ్యంగా భారత ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.