Let's talk: editor@tmv.in
అమెరికా కరెన్సీపై ఇక ‘ట్రంప్’ సంతకం

అమెరికా కరెన్సీపై ఇక ‘ట్రంప్’ సంతకం

Shaik Mohammad Shaffee
28 మార్చి, 2026

అమెరికా చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబోతున్న తరుణంలో, ఆ దేశ కరెన్సీ నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం దర్శనమివ్వనుంది. సాధారణంగా అమెరికా కరెన్సీపై ట్రెజరీ కార్యదర్శి, కోశాధికారి సంతకాలు మాత్రమే ఉంటాయి. అయితే 1861లో డాలర్ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత, ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ (పదవిలో ఉన్న అధ్యక్షుడు) సంతకం కరెన్సీపై ముద్రించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మేరకు అమెరికా ట్రెజరీ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికా ‘సెమీక్వినెంటెనియల్’ కానుక

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను (సెమీక్వినెంటెనియల్) పురస్కరించుకుని ఈ చారిత్రాత్మక మార్పును చేపట్టినట్లు యూఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ వెల్లడించారు. "అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ సంతకం, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ సంతకంతో కూడిన కరెన్సీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది ట్రంప్ నాయకత్వానికి, దేశం పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక పునరుజ్జీవనానికి ట్రంప్ ఒక శిల్పి లాంటివారని, అందుకే ఆయన సంతకాన్ని నోట్లపై ముద్రించడం సముచితమని బీచ్ కొనియాడారు.

బంగారు నాణెంపై ట్రంప్ ముద్ర

కరెన్సీ నోట్లతో పాటు, ట్రంప్ గౌరవార్థం ఒక ప్రత్యేక స్మారక బంగారు నాణేన్ని కూడా విడుదల చేయనున్నారు. 24 క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఈ నాణెంపై ట్రంప్ చిత్రం ఉండనుంది. దీనికి సంబంధించిన తుది డిజైన్‌ను ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఇప్పటికే ఆమోదించింది. ఈ నాణెంలో ట్రంప్ తన 'రెజల్యూట్ డెస్క్'పై చేతులు ఆనించి, పిడికిలి బిగించి ఉన్నట్లుగా చిత్రీకరించారు. అమెరికా చరిత్రలో ఒక జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రం నాణెంపై ముద్రించడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం.

ఆర్థిక శక్తికి చిహ్నం

ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రంప్ నాయకత్వంలో అమెరికా అపూర్వమైన ఆర్థిక వృద్ధి దిశగా సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. డాలర్ ఆధిపత్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని చాటిచెప్పడానికి ట్రంప్ పేరుతో కూడిన కరెన్సీని విడుదల చేయడం కంటే శక్తివంతమైన మార్గం మరొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక కరెన్సీ అమెరికా సాధించిన ఘనతలకు గుర్తుగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.