
అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ‘యుద్ధ’ గర్జన!
ఇరాన్‌లో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటం పతాక స్థాయికి చేరింది. దేశవ్యాప్త నిరసనలు మూడో వారానికి చేరుకోగా, హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 116కు చేరిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ.. శాంతియుత నిరసనకారులపై ఉక్కుపాదం మోపితే ఇరాన్‌పై సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ ఆదివారం నిప్పులు చెరిగారు. అమెరికా గనుక తమపై ఒక్క దాడి చేసినా, మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ భూభాగం తమకు ‘చట్టబద్ధమైన లక్ష్యాలు’ అవుతాయని యుద్ధ ప్రకటన చేశారు.
పార్లమెంట్‌లో ‘డెత్ టు అమెరికా’ నినాదాలు
ఆదివారం ఇరాన్ పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఉద్రిక్తంగా సాగాయి. ట్రంప్ హెచ్చరికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి "అమెరికా ముర్దాబాద్" అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఖలీబాఫ్ మాట్లాడుతూ.. నిరసనకారులను అణచివేస్తున్న పోలీసులను, రివల్యూషనరీ గార్డ్స్ విభాగాన్ని అభినందించారు. నిరసనకారులను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరిస్తూనే, విదేశీ శక్తుల జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని, ముందస్తు హెచ్చరిక లేకుండానే ప్రతిదాడి చేస్తామని స్పష్టం చేశారు.
దశాబ్ద కాలంలో అతిపెద్ద నిరసనలు
గత డిసెంబర్ 28న ఇరాన్ కరెన్సీ 'రియల్' విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంతో (ఒక డాలర్‌కు 14 లక్షల రియల్స్) మొదలైన ఈ నిరసనలు, ఇప్పుడు ఏకంగా మతపరమైన పాలనను కూల్చివేయాలనే డిమాండ్‌గా మారాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో ఇలాంటి అల్లకల్లోల పరిస్థితులు ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడం, అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోశాయి.
టెహ్రాన్, మాషద్‌లలో ఉద్రిక్తత
రాజధాని టెహ్రాన్‌తో పాటు రెండో అతిపెద్ద నగరం మాషద్ నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి బాహ్య ప్రపంచంతో సంబంధాలను తెంచేసింది. అయినప్పటికీ నిరసనకారులు 'స్టార్‌లింక్' ఉపగ్రహ ప్రసారాల ద్వారా వీడియోలను బయటకు పంపుతున్నారు. టెహ్రాన్‌లోని పునక్ ప్రాంతంలో ప్రజలు వేల సంఖ్యలో గుమిగూడి తమ మొబైల్ ఫోన్ లైట్లు వెలిగిస్తూ నిరసన తెలిపారు. భద్రతా దళాలు డ్రోన్లతో ఆందోళనకారులను నిరంతరం పర్యవేక్షిస్తూ కాల్పులకు తెగబడుతున్నాయి.
ట్రంప్ హెచ్చరిక
"ఇరాన్ స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తోంది, అమెరికా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది" అని ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ఇరాన్ లోని కీలక సైనిక కేంద్రాలపై వైమానిక దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్‌కు ఆదేశాలు అందినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే అమెరికా 5వ నౌకాదళం, ఖతార్‌లోని అల్ ఉదైద్ బేస్ హై అలర్ట్‌లో ఉన్నాయి. మరోవైపు, ఒకవేళ అమెరికా గనుక ఇరాన్‌పై దాడులు ప్రారంభిస్తే.. దానికి మద్దతుగా ఇరాన్ వ్యతిరేక పోరాటంలో పాల్గొనేందుకు తాము కూడా సిద్ధమని ఇజ్రాయెల్ సైన్యం సంకేతాలిచ్చింది.
2,600 మందిపై దైవ ద్రోహం కేసులు
ఇరాన్ అధికారిక మీడియా మాత్రం.. దేశంలో అంతా ప్రశాంతంగా ఉందంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవ దృశ్యాలు అత్యంత భీతావహంగా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలను పరిశీలిస్తే.. ట్రక్కుల నిండా మృతదేహాలు, మార్చురీలలో గుట్టలుగా పేరుకుపోయిన శవాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరెస్టయిన 2,600 మందిపై అత్యంత కఠినమైన ‘దైవద్రోహం’ (ముహారెబె) అభియోగాల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం. వీరికి ఉరిశిక్ష పడే అవకాశం ఉందని ఇరాన్ అటార్నీ జనరల్ స్వయంగా హెచ్చరించడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ప్రవాస యువరాజు పిలుపు
ఇరాన్ మాజీ షా కుమారుడు, ప్రవాస యువరాజు రెజా పహ్లావీ నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ఆదివారం కూడా భారీ ఎత్తున వీధుల్లోకి రావాలని, ఇరాన్ పాత జాతీయ చిహ్నాలను ధరించి తమ నిరసన తెలపాలని ఆయన కోరారు. ఇరాన్ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ ఏ క్షణమైనా పూర్తిస్థాయి సైనిక అణచివేతకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
నిరసనకారులతో చర్చిస్తాం: ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిరసనలపై ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఉన్న సమస్యలు, ఆందోళనలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారి సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. అయితే నిరసనల ముసుగులో దేశాన్ని, సమాజాన్ని నాశనం చేయాలని చూసే అల్లరిమూకలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం నేరుగా ప్రభుత్వానికే సవాలుగా మారిన నేపథ్యంలో సంస్కరణవాదిగా పేరున్న పెజెష్కియాన్ కూడా ఇప్పుడు కఠిన స్వరాన్ని వినిపించడం గమనార్హం.
