Let's talk: editor@tmv.in
అమెరికాలో హై అలర్ట్.. టెక్సాస్ విమానాశ్రయం మూసివేత

అమెరికాలో హై అలర్ట్.. టెక్సాస్ విమానాశ్రయం మూసివేత

Shaik Mohammad Shaffee
12 ఫిబ్రవరి, 2026

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల ఎల్‌ పాసో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను అధికారులు ఆకస్మికంగా నిలిపివేశారు. 'ప్రత్యేక భద్రతా కారణాల' దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకటించడమే కాకుండా, ఆ ప్రాంతాన్ని 'జాతీయ రక్షణ గగనతలం' (నేషనల్ డిఫెన్స్ ఎయిర్‌స్పేస్)గా మార్చేసింది. అయితే, అసలు ఏ కారణం చేత ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని అధికారులు బయటకు వెల్లడించకపోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

సైనిక స్థావరానికి సమీపంలోనే..

ఈ విమానాశ్రయం అమెరికా సైన్యానికి చెందిన 'బిగ్స్ ఆర్మీ ఎయిర్‌ఫీల్డ్'కు ఆనుకుని ఉండటం, అలాగే మెక్సికోలోని సియుడాడ్ జుయారెజ్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటంతో ఈ భద్రతా ఆంక్షలకు ప్రాధాన్యత ఏర్పడింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాలను నిలిపివేయాలని ఎఫ్‌ఏఏ నుంచి సమాచారం అందిందని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కేవలం ఎల్‌ పాసోనే కాకుండా, సమీపంలోని న్యూ మెక్సికోలోని శాంటా తెరెసా మీదుగా వెళ్లే విమానాలపై కూడా ఏజెన్సీ నిషేధం విధించింది.

నిబంధనలు అతిక్రమిస్తే కాల్చివేతే!

కొత్త ఆంక్షల ప్రకారం.. అనుమతి లేకుండా ఈ గగనతలంలోకి ప్రవేశించే ఏ విమానాన్నైనా అడ్డుకోవడమే కాకుండా, అవసరమైతే 'డెడ్లీ ఫోర్స్' (ప్రాణాంతక శక్తి) ఉపయోగించి కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు. కమర్షియల్, కార్గో, సాధారణ విమానయాన సర్వీసులన్నింటినీ తక్షణమే నిలిపివేశారు.

స్తంభించిన రవాణా.. వైద్య సేవలకు ఆటంకం

ఎఫ్‌ఏఏ నిర్ణయంతో సుమారు 7 లక్షల మంది నివాసితుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పదుల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. ఈ సరిహద్దు ప్రాంతంలో కనీసం అత్యవసర వైద్య సేవల విమానాలను కూడా అనుమతించకపోవడం గమనార్హం. "కనీస హెచ్చరిక లేకుండా ఇలాంటి ఆంక్షలు విధించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది" అని సిటీ కౌన్సిల్ సభ్యుడు క్రిస్ కెనాల్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 20 వరకు ఆంక్షలు

మెక్సికన్ గగనతలాన్ని మినహాయించి, దాదాపు 10 నాటికల్ మైళ్ల వ్యాసార్థంలో ఈ విమానయాన ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. ముందస్తు సమాచారం లేకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2025 సంవత్సరం మొదటి 11 నెలల్లోనే దాదాపు 34.9 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిన ఈ కీలక విమానాశ్రయం ఒక్కసారిగా మూతపడటం అక్కడి రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.

గూఢచారి డ్రోన్లా? భద్రతా ముప్పా?

అసలు ఏ కారణంతో అకస్మాత్తుగా విమానాశ్రయాన్ని మూసివేసి, గగనతలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారనే విషయంపై అమెరికా అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇది సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలా లేక ఏదైనా రహస్య భద్రతా ఆపరేషన్ జరుగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. గూఢచారి డ్రోన్ల సంచారం లేదా ఏదైనా భద్రతా ముప్పు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల కేవలం విమాన ప్రయాణికులే కాకుండా, ప్రాణాలు కాపాడే అత్యవసర వైద్య విమాన సేవలు కూడా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రతా సమీక్ష పూర్తయ్యే వరకు విమానాల పునరుద్ధరణపై స్పష్టత వచ్చేలా లేదు.