Let's talk: editor@tmv.in
అమెరికాలో హైదరాబాద్‌ యువతి హత్య.. భారత్‌కు పారిపోయిన నిందితుడు!

అమెరికాలో హైదరాబాద్‌ యువతి హత్య.. భారత్‌కు పారిపోయిన నిందితుడు!

Shaik Mohammad Shaffee
6 జనవరి, 2026

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో నివసిస్తున్న నిఖిత గోడిశాల (27) అనే భారతీయ యువతి దారుణ హత్యకు గురవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ హెల్త్‌కేర్ విభాగంలో వృత్తి నిపుణురాలిగా స్థిరపడిన నిఖిత ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబ సభ్యులను, స్థానిక భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జనవరి 2న ఆమె కనిపించకుండా పోవడంతో గాలింపు చేపట్టిన పోలీసులకు, చివరకు కొలంబియాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది.

ఈ హత్య వెనుక ఆమెకు తెలిసిన అర్జున్ శర్మ (26) అనే యువకుడి హస్తం ఉన్నట్లు అమెరికా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిఖిత శరీరపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిఖిత కనిపించడం లేదని పోలీసులకు మొదట ఫిర్యాదు చేసింది కూడా నిందితుడు అర్జున్ శర్మనే. అయితే, ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే అతడు అమెరికా వదిలి భారతదేశానికి పారిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నిందితుడు అర్జున్ శర్మపై అమెరికా పోలీసులు ఇప్పటికే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేసి, అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అతడు దేశం దాటి వెళ్లిన నేపథ్యంలో, ఫెడరల్ ఏజెన్సీల సహాయంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత పోలీసుల సహకారంతో నిందితుడిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకోవాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు.

అర్జున్ ‘'మాజీ ప్రియుడు’ కాదు: నిఖిత తండ్రి

హైదరాబాద్‌లో ఉంటున్న నిఖిత తండ్రి ఆనంద్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు అర్జున్ శర్మ తన కుమార్తెకు 'మాజీ ప్రియుడు' అని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తమకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదని, కేవలం మీడియాలో వస్తున్న కథనాల ద్వారానే అతడు భారీగా అప్పులు చేశాడని, ఆ గొడవల్లోనే తన కుమార్తెని హత్య చేసి ఉండవచ్చని తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

తన కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆనంద్ కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు. విదేశాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు చట్టపరమైన ప్రక్రియలు సంక్లిష్టంగా ఉంటాయని, అందుకే ప్రభుత్వం చొరవ తీసుకుని తన బిడ్డ మృతదేహాన్ని తమ వద్దకు చేర్చాలని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ ఘటనపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. నిఖిత కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, వారికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి అవసరమైన పత్రాలు, స్థానిక పోలీసులతో సమన్వయం వంటి విషయాల్లో రాయబార కార్యాలయం చొరవ చూపుతోంది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంబసీ స్పష్టం చేసింది.

నికితా స్నేహితులు, స్థానిక భారతీయ సంఘాల సభ్యులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఎంతో ఆశలతో అమెరికాకు వచ్చిందని, ఇలాంటి ఘోరం జరగడం బాధాకరమని వారు ఆవేదన చెందారు. నిఖిత కేసులో త్వరగా న్యాయం జరగాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని భారతీయ ప్రవాసులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల రక్షణపై మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. అమెరికాలో ఉంటున్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని ఎంబసీ సూచించింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేరీల్యాండ్ పోలీసులు తెలిపారు.

అమెరికాలో హైదరాబాద్‌ యువతి హత్య.. భారత్‌కు పారిపోయిన నిందితుడు! - Tholi Paluku