
అమెరికాలో షట్‌డౌన్ ఎఫెక్ట్: 1,700కి పైగా విమానాలు రద్దు
అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత (షట్‌డౌన్) ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. కాంగ్రెస్‌లో బడ్జెట్ ప్రతిష్టంభన కారణంగా తలెత్తిన ఈ సంక్షోభం వల్ల, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లలో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. దీని ఫలితంగా ఈ వారాంతంలో (శని, ఆదివారాలు) 1,700 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి, వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి.
వేతనం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అలసటకు గురవుతున్న నేపథ్యంలో, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దేశంలోని 40 ప్రధాన విమానాశ్రయాల్లో రోజువారీ విమానాలను 10 శాతం తగ్గించాలని ఆదేశించింది. ఇందులో న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, అట్లాంటా, డల్లాస్ వంటి నగరాలు ఉన్నాయి.
అమెరికా రవాణా కార్యదర్శి షా డఫీ మాట్లాడుతూ, “సిబ్బందిలో అలసట పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. అమెరికాలో రోజుకు సగటున 44,000 విమానాలు నడుస్తుండగా, 10 శాతం తగ్గింపు అంటే రోజుకు సుమారు 1,800 విమానాలు తక్కువగా నడుస్తాయన్న మాట.
మరోవైపు న్యూయార్క్, అట్లాంటా, వాషింగ్టన్, చికాగో, లాస్ ఏంజెల్స్ విమానాశ్రయాల్లో గంటల కొద్దీ విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఒక దశలో ఇన్‌కమింగ్ విమానాల కోసం గ్రౌండ్ స్టాప్ కూడా ప్రకటించాల్సి వచ్చింది. అమెరికాలోని ఈ సంక్షోభం ప్రభావం టొరంటో, ఆమ్‌స్టర్‌డామ్, టోక్యో వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలపై కూడా పడింది.
షట్‌డౌన్ కారణంగా 1.4 మిలియన్లకు పైగా ఫెడరల్ ఉద్యోగులు నేరుగా ప్రభావితమయ్యారు. కొందరు ఉద్యోగులు తాత్కాలికంగా సెలవుపై వెళ్లగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది వంటి వారు వేతనం లేకుండా పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది రోజువారీ ఖర్చులు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, ఈ ప్రతిష్ఠంభన కొనసాగితే అమెరికా జీడీపీలో 2 శాతం వరకు తగ్గుదల సంభవించే అవకాశం ఉంది. మొత్తం ఆర్థిక నష్టం 14 బిలియన్ డాలర్ల దాకా ఉండవచ్చని గోల్డ్మాన్ సాక్స్ పేర్కొంది. “ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టదాయకమైన ప్రభుత్వ మూసివేత” అని సంస్థ తెలిపింది. మాజీ ఎఫ్ఏఏ ఉపాధ్యక్షుడు డాన్ ఎల్వెల్ మాట్లాడుతూ, ఈ సంక్షోభం త్వరలో పరిష్కారం కాకపోతే, రాబోయే సెలవుల సమయంలో ప్రయాణాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.
ఈ రాజకీయ ప్రతిష్టంభనకు ప్రధాన కారణం డెమొక్రాట్‌లు, రిపబ్లికన్‌ల మధ్య ఉన్న విభేదమే. డెమొక్రాట్లు, తక్కువ ఆదాయ కుటుంబాల కోసం ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలను విస్తరించాలని ఒత్తిడి చేస్తుండగా, రిపబ్లికన్లు మాత్రం చర్చలు కొనసాగించడానికి ముందు ప్రభుత్వం షట్‌డౌన్ ఎత్తివేయాలని పట్టుబడుతున్నారు. ఈ ప్రతిష్టంభన కారణంగా లక్షలాది మంది అమెరికన్లు ఇబ్బందులు పడుతుండగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమొక్రాట్లు "దేశాన్ని నాశనం చేయడానికి" ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే ఆరో వారంలోకి ప్రవేశించిన ఈ ప్రభుత్వ మూసివేత వల్ల అమెరికా ప్రజలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతోంది. విమాన రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది అనే పరిస్థితి ఏర్పడింది.
