
అమెరికాలో వీసా మోసం కేసు: 11 మంది భారతీయులపై అభియోగాలు
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 11 మంది భారతీయులపై వీసా మోసం కేసులో అభియోగాలు మోపినట్లు అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. కన్వీనియన్స్ స్టోర్లలో నకిలీ ఆయుధాలతో దోపిడీలు జరిగినట్లు నాటకం వేసి, ఆ ఘటనల్లో తాము బాధితులమని చూపించి గ్రీన్ కార్డ్ పొందేందుకు కుట్ర పన్నినట్టు అధికారులు వెల్లడించారు.
జితేంద్రకుమార్ పటేల్ (39), మహేష్‌కుమార్ పటేల్ (36), సంజయ్‌కుమార్ పటేల్ (45), దీపికాబెన్ పటేల్ (40), రమేష్‌భాయ్ పటేల్ (52), అమితాబహెన్ పటేల్ (43), రోనక్కుమార్ పటేల్ (28), సంగితాబెన్ పటేల్ (36), మింకేష్ పటేల్ (42), సోనల్ పటేల్ (42), మితుల్ పటేల్ (40) పై వీసా మోసం చేయడానికి కుట్ర పన్నినట్టు ఒక కేసు నమోదు చేశారు. వీరు మసాచుసెట్స్, కెంటకీ, ఒహియో వంటి రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్నట్లు వెల్లడైంది.
మసాచుసెట్స్‌లోని వెయ్‌మౌత్ ప్రాంతంలో అక్రమంగా నివసించిన దీపికాబెన్ పటేల్‌ను ఇప్పటికే భారత్‌కు డిపోర్ట్ చేసినట్లు అమెరికా న్యాయ శాఖ తెలిపింది. జితేంద్రకుమార్, మహేష్‌కుమార్, సంజయ్‌కుమార్, అమితాబహెన్, సంగితాబెన్, మితుల్ పటేల్‌లను మసాచుసెట్స్‌లో అరెస్ట్ చేసి బోస్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు రమేష్‌భాయ్, రోనక్కుమార్, సోనల్, మింకేష్‌లను కెంటకీ, మిస్సోరి, ఒహియో రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు. వీరు తరువాత బోస్టన్ కోర్టులో హాజరుకానున్నారు.
కేసు వివరాల ప్రకారం, 2023 మార్చిలో రాంభాయ్, అతని సహచరులు మసాచుసెట్స్ సహా కొన్ని ప్రాంతాల్లో కనీసం ఆరు కన్వీనియన్స్ స్టోర్లు, లిక్కర్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో నకిలీ ఆయుధాలతో దోపిడీ జరిగినట్లు నాటకం వేశారు. దాని ద్వారా అక్కడ పనిచేసే క్లర్కులు తాము హింసాత్మక నేరానికి బాధితులమని చూపించి “యూ వీసా” కోసం దరఖాస్తు చేసుకునేలా ప్లాన్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
“యూ వీసా” అనేది కొన్ని నేరాలకు బాధితులైన వ్యక్తులకు ఇవ్వబడే ప్రత్యేక వీసా. ఇది మానసిక లేదా శారీరకంగా హింసను అనుభవించిన వారికి, అలాగే నేరాల దర్యాప్తులో పోలీసులకు సహకరించిన వారికి ఇస్తారు. ఈ వీసా ద్వారా అమెరికాలో పని చేసే అనుమతి లభించడంతో పాటు 5 నుంచి 10సంవత్సరాల లోపు గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉంటుంది.
దర్యాప్తు ప్రకారం, ఈ నకిలీ దోపిడీల సమయంలో “దొంగ” తుపాకీ లాంటి ఆయుధంతో స్టోర్ క్లర్క్ లేదా యజమానిని బెదిరించి క్యాష్ రిజిస్టర్‌లోని డబ్బు తీసుకుని పారిపోయేవాడు. ఆ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యేది. తరువాత క్లర్కులు లేదా యజమానులు ఐదు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిచిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసేవారు.
ఈ కుట్రలో పాల్గొనడానికి “బాధితులుగా” నటించిన వారు రాంభాయ్‌కు డబ్బు చెల్లించారని అధికారులు తెలిపారు. రాంభాయ్ మాత్రం దోపిడీ నాటకం కోసం స్టోర్ యజమానులకు కూడా డబ్బు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాంభాయ్, నకిలీ దొంగ కారులో తీసుకెళ్లిన డ్రైవర్‌పై కేసులు నమోదు చేసి శిక్ష విధించారు.
శుక్రవారం అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ 11 మంది నిందితులు, ప్రతి దోపిడీ నాటకాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించి, తాము లేదా తమ కుటుంబ సభ్యులను “బాధితులుగా” చూపించేందుకు డబ్బు చెల్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీసా మోసం చేయడానికి కుట్ర పన్నిన ఈ కేసులో గరిష్ఠంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, 3 సంవత్సరాల పర్యవేక్షణతో విడుదల (సూపర్వైజ్డ్ రీలీజ్), 2.5 లక్షల అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
