
అమెరికాలో ముగిసిన 'షట్‌డౌన్'.. నిధుల బిల్లుపై ట్రంప్ సంతకం
అమెరికా ప్రభుత్వ పాక్షిక షట్‌డౌన్‌కు తెరపడింది. సుమారు 1.2 ట్రిలియన్ డాలర్ల ప్రభుత్వ నిధుల బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంతకం చేశారు. దీంతో వారాంతం నుంచి నిలిచిపోయిన ఫెడరల్ ఏజెన్సీల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రతినిధుల సభలో 217-214 ఓట్ల స్వల్ప తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, ట్రంప్ వేగంగా స్పందించి దీనిని చట్టరూపంలోకి తెచ్చారు. "ఈ బిల్లు అమెరికా ప్రజల విజయం" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
హోంల్యాండ్ సెక్యూరిటీకి ‘పరిమిత’ నిధులు
ఈ బిల్లు ద్వారా సెప్టెంబర్ 30 వరకు మెజారిటీ ప్రభుత్వ విభాగాలకు నిధులు అందుతాయి. అయితే, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి మాత్రం కేవలం ఫిబ్రవరి 13 వరకు (రెండు వారాలు) మాత్రమే నిధులు కేటాయించారు. మిన్నియాపాలిస్‌లో ఫెడరల్ ఆఫీసర్ల కాల్పుల్లో అలెక్స్ ప్రెట్టి, రెనీ గుడ్ అనే వ్యక్తులు మరణించడంతో.. వలసల అమలుపై కఠిన నిబంధనలు ఉండాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. దీంతో ఈ విభాగంపై ఫిబ్రవరి 13 తర్వాత మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉంది.
హోరాహోరీగా సాగిన ఓటింగ్
సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం స్పీకర్ మైక్ జాన్సన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. గంట పాటు ఉత్కంఠగా సాగిన ఓటింగ్‌లో రిపబ్లికన్ల మద్దతు కూడగట్టడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. చివరికి 21 మంది రిపబ్లికన్లు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయగా, అంతే సంఖ్యలో డెమొక్రాట్లు అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. గతంలో వచ్చిన 43 రోజుల సుదీర్ఘ షట్‌డౌన్ కంటే ఇది భిన్నమైనదని, ఇప్పటికే 96 శాతం ప్రభుత్వానికి నిధులు అందాయని స్పీకర్ పేర్కొన్నారు. మిగిలిన 4 శాతం (హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ) విషయంలో చర్చలు కొనసాగుతాయన్నారు.
ఇరుపక్షాల పట్టు
డెమొక్రాట్ నేత హకీమ్ జెఫ్రీస్ మాట్లాడుతూ.. 'ఐసీఈ వంటి ఏజెన్సీల పనితీరులో సమూల మార్పులు వస్తే తప్ప తదుపరి నిధులకు మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. మరోవైపు, రిపబ్లికన్ నేత జాన్ థూన్ మాత్రం గడువులోగా ఒప్పందం కుదురుతుందన్న విషయంలో అంత ఆశాభావంగా లేరు. "అద్భుతాలు ఎప్పుడైనా జరగొచ్చు" అంటూ ఆయన వ్యాఖ్యానించడం భవిష్యత్తులో జరగబోయే చర్చల తీవ్రతను సూచిస్తోంది.
