
అమెరికాలో భారతీయ విద్యార్థి అదృశ్యం: ఆందోళనలో కుటుంబం!
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య, కాలిఫోర్నియాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. గత మంగళవారం (ఫిబ్రవరి 10) నుంచి అతను కనిపించకుండా పోవడంతో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
సాకేత్ అదృశ్యమైన తీరు అనేక అనుమానాలకు దారితీస్తోంది. బర్క్లీలోని పార్క్ హిల్స్ పరిసరాల్లో ఒక ఇంటి గుమ్మం వద్ద సాకేత్ బ్యాగు లభ్యమైందని ది బర్క్లీ స్కానర్' వార్తా సంస్థ నివేదించింది.
ఆ బ్యాగులో అతని పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ వంటి విలువైన వస్తువులు ఉండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సాకేత్ చివరిసారిగా 'డ్వైట్ వే' ప్రాంతంలో లోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు ప్రత్యక్ష సాక్ష్యాల ఆధారంగా గుర్తించారు.
ఈ ఘటనపై సాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాకేత్ ఆచూకీ కోసం స్థానిక పోలీసు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అతని కుటుంబానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించింది. సాకేత్ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అని సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాకేత్ సుమారు 6 అడుగుల 1 అంగుళం ఎత్తు ఉంటాడు. నల్లని జుట్టు, గోధుమ రంగు కళ్లు కలిగి ఉండి, సుమారు 73 కిలోల బరువు ఉంటాడు. ప్రస్తుతం బర్క్లీ పోలీసులు ఇతడిని 'అట్-రిస్క్' (ప్రమాదంలో ఉన్న వ్యక్తి) గా వర్గీకరించి, లేక్ అన్జా పరిసరాల్లో గాలింపు చేపడుతున్నారు.
సాకేత్ గురించి ఎవరికైనా ఏవైనా ఆనవాళ్లు దొరికినా లేదా సమాచారం తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థుల అదృశ్యం లేదా మరణాలు సంభవిస్తుండటంతో ప్రవాస భారతీయుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
