
అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు షాక్.. కాలిఫోర్నియాలో 17 వేల లైసెన్స్‌లు రద్దు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సుమారు 17,000 మంది వలసదారులకు జారీ చేసిన వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ డ్రైవర్లు చట్టబద్ధంగా అమెరికాలో ఉండడానికి అనుమతించబడిన గడువు కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే విధంగా ఈ లైసెన్స్‌ల గడువు తేదీలు ఉన్నాయని గుర్తించిన తర్వాత రాష్ట్ర అధికారులు ఈ మేరకు ప్రకటన చేశారు.
ట్రంప్ సర్కార్ ముఖ్యంగా రవాణా శాఖ, కాలిఫోర్నియా, ఇతర రాష్ట్రాలు చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్న వ్యక్తులకు లైసెన్స్‌లు జారీ చేస్తున్నాయని తీవ్రంగా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. రద్దుకు ప్రధాన కారణం లైసెన్స్‌ల గడువు తేదీలు. లైసెన్స్‌లు ఆ వ్యక్తుల చట్టపరమైన నివాస గడువు ముగిసిన తర్వాత కూడా చెల్లుబాటు అయ్యేలా ఇచ్చారు.
రాష్ట్ర చట్టం ప్రకారం, లైసెన్స్‌లు డీఎంవీకి నివేదించిన విధంగా ఆ వ్యక్తి చట్టపరమైన నివాస గడువు ముగిసే తేదీకి లేదా అంతకుముందే ముగియాలి. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు రాష్ట్ర అధికారులు అంగీకరించారు. రవాణా కార్యదర్శి షాన్ డఫీ ఈ చర్యను ఉటంకిస్తూ, కాలిఫోర్నియా గతంలో తన లైసెన్సింగ్ విధానాలను సమర్థించుకున్నప్పటికీ, ఇప్పుడు తప్పుగా వ్యవహరించిందని అంగీకరించిందని అన్నారు. "మేము వారి అబద్ధాలను బయటపెట్టాం. ఇప్పుడు 17,000 చట్టవిరుద్ధంగా జారీ చేయబడిన లైసెన్స్‌లు రద్దు చేయబడుతున్నాయి" అని డఫీ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసొమ్‌ను ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు.
కాలిఫోర్నియా ప్రతిస్పందన
లైసెన్స్‌లు రద్దు చేయబడిన డ్రైవర్లందరికీ ఫెడరల్ ప్రభుత్వం నుండి చెల్లుబాటు అయ్యే పని అనుమతులు ఉన్నాయని న్యూసొమ్ కార్యాలయం పేర్కొంది. న్యూసొమ్ ప్రతినిధి బ్రాండన్ రిచర్డ్స్ మాట్లాడుతూ, షాన్ డఫీ "నిజం చెప్పడంలో విఫలమయ్యారు. తమ ప్రియతమ నాయకుడిని సంతోషపెట్టడానికి నిరూపించలేని అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు" అని విమర్శించారు.
భద్రతా ఆందోళనలు
ఇటీవల కాలంలో అమెరికాలో జరిగిన ఘోర ట్రక్కు ప్రమాదాలలో చట్టవిరుద్ధంగా జారీ చేయబడిన లైసెన్స్‌లు ఉన్న డ్రైవర్ల ప్రమేయం ఉండటం ఈ అంశాన్ని మరింత తీవ్రతరం చేసింది. ట్రక్కు డైవర్లకు ఇంగ్లిష్ చదవడం, రాయడం అమలు చేయడంలో కాలిఫోర్నియా విఫలమైందని ఆరోపిస్తూ డఫీ ఇప్పటికే 40 మిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను రద్దు చేశారు. చట్టవిరుద్ధంగా జారీ చేసిన ప్రతి లైసెన్స్‌ను రద్దు చేయకపోతే, రాష్ట్రం నుండి అదనంగా 160 మిలియన్ డాలర్లను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ లైసెన్స్‌ల రద్దు ప్రక్రియ అనేది రాష్ట్రం ఫెడరల్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే.
కొత్త నిబంధనలు
రవాణా శాఖ కార్యదర్శి డఫీ సెప్టెంబర్‌లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం కొత్త కఠినమైన నియమాలను ప్రకటించారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై కేవలం హెచ్-2ఏ (తాత్కాలిక వ్యవసాయ కార్మికులకు ఉద్దేశించింది), హెచ్-2బీ (తాత్కాలిక వ్యవసాయేతర కార్మికులకు ఉద్దేశించింది), ఈ-2 (అమెరికా వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు ఉద్దేశించింది) వీసాలు కలిగిన వారు మాత్రమే వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సుకు అర్హులు అవుతారు. అయితే దరఖాస్తుదారుల ఇమ్మిగ్రేషన్ గడువును రాష్ట్రాలు ఫెడరల్ డేటాబేస్‌లలో తప్పనిసరిగా ధృవీకరించాలి. లైసెన్స్ గడువు గరిష్టంగా ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఈ కొత్త నిబంధనలతో ప్రస్తుతం ఉన్న 2 లక్షల నాన్‌సిటిజన్ డ్రైవర్లలో కేవలం 10,000 మందికే లైసెన్స్ లభిస్తుంది. మిగతా 1,90,000 మందికి లైసెన్స్ గడువు ముగిసే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
కాలిఫోర్నియా రాష్ట్రం తెలిపిన ప్రకారం, ఈ లైసెన్సులు జారీ చేసినప్పుడు ఆ నిబంధనలు అమల్లో లేవు. అయినప్పటికీ, సంబంధిత డ్రైవర్లకు 60 రోజుల్లో వారి లైసెన్సులు గడువు ముగుస్తాయని నోటీసులు పంపారు. డఫీ గతంలో నిర్వహించిన ఆడిట్‌లో పరిశీలించిన 145 లైసెన్సుల్లో 25 శాతం చెల్లనివని తేలిందని తెలిపారు. ఆయన ప్రకారం, కొన్ని లైసెన్సులు డ్రైవర్ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యాయి. న్యూసమ్ కార్యాలయం అయితే, ఈ లైసెన్సులు జారీ చేయడంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మార్గదర్శకాలను అనుసరించామని స్పష్టం చేసింది.
