
అమెరికాలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకుంది: ట్రంప్
అమెరికా అంతటా పెరుగుతున్న జీవన వ్యయాలపై ఆందోళనల మధ్య, ధరల ఒత్తిడిని ఎదుర్కోవడంలో తన ప్రభుత్వ చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీ యజమానులు, సరఫరాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ఆర్థిక విధానాలు ద్రవ్యోల్బణాన్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చాయని, అలాగే గృహ ఖర్చులను తగ్గించడంలో మరింత పురోగతిని సాధిస్తామని హామీ ఇచ్చారు. “మేము ద్రవ్యోల్బణాన్ని తక్కువ స్థాయికి తీసుకువచ్చాం, ఇంకా కొంచెం తగ్గించబోతున్నాం” అని ట్రంప్ చెప్పారు.
అంతేగాక జీవన వ్యయాలను పెంచినందుకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను మరోసారి విమర్శిస్తూ, 2024 ఎన్నికలలో తాను విజయం సాధించడం అమెరికన్ల అదృష్టమని చెప్పారు. “ధరల విషయంలో ఎవ్వరూ మేం చేసిన పనిని చేయలేదు. మేము పూర్తిగా ఒక గందరగోళ పరిస్థితిని స్వీకరించాం” అని ట్రంప్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం 200 ఆహార దిగుమతులపై సుంకాలను తగ్గించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. వీటిలో గొడ్డు మాంసం, అరటిపండ్లు, కాఫీ, ఆరెంజ్ జ్యూస్ వంటివి ఉన్నాయి. అదనంగా సుంకాల నిధులతో 2 వేల అమెరికన్ డాలర్ల రాయితీ చెక్కులు ఇవ్వడం, 50 ఏళ్ల హౌసింగ్ రుణాల అవకాశాన్ని కూడా ఆయన ప్రతిపాదించారు
అల్ జజీరా నివేదిక ప్రకారం, బైడెన్ పదవీకాలంలో 40 ఏళ్ల గరిష్టమైన 9.1 శాతం ద్రవ్యోల్బణం ప్రస్తుతం గణనీయంగా తగ్గినా, ఇది ఫెడరల్ రిజర్వ్ లక్ష్యమైన 2 శాతం కంటే ఇంకా ఎక్కువగానే ఉంది. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 3 శాతానికి పెరిగిందని, ఇది జనవరి తర్వాత మొదటిసారి నమోదు అయిన పెరుగుదలని పేర్కొంది. ట్రంప్ తాజా వాణిజ్య నిర్ణయాల తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుదల ఉంటుందని విశ్లేషకులు ఊహించినప్పటికీ, అది జరగలేదని కూడా తెలిపింది.
ట్రంప్ తన ప్రసంగంలో మెక్‌డొనాల్డ్స్ ఫాస్ట్ ఫుడ్ చైన్‌ను ప్రశంసించారు. ఆ సంస్థ తమ విస్తృత ఆర్థిక విధానానికి ఒక ఆదర్శం అని ఉదహరించారు. సరసమైన ధరల్లో భోజనాన్ని అందించినందుకు, ముఖ్యంగా 5 లేదా 8 అమెరికన్ డాలర్లలో 'ఎక్స్‌ట్రా వాల్యూ' ఎంపికలను తిరిగి ప్రవేశపెట్టినందుకు ఆయన మెక్‌డొనాల్డ్స్‌కు "ప్రత్యేక ధన్యవాదాలు" తెలిపారు. “ఈ దేశానికి ధరలను తగ్గిస్తున్నాం, అందులో మెక్‌డొనాల్డ్స్ కంటే మంచి నాయకుడూ, మద్దతుదారుడూ లేరు” అని ట్రంప్ అన్నారు.
