
అమెరికాలో ఘోరం: భార్య సహా ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భారత సంతతి వ్యక్తి ఉన్మాదిలా మారి తన భార్యతో పాటు మరో ముగ్గురు బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా ఉన్న భారతీయ సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.
అర్ధరాత్రి వేళ రక్తపాతం
పోలీసుల కథనం ప్రకారం, 51 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి లారెన్స్‌విల్లే నగరంలోని తన బంధువుల నివాసంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో, ఇంట్లోని వారందరూ నిద్రలో ఉండగా ఈ కాల్పులు జరిగాయి. తుపాకీ శబ్దాలు విన్న నిందితుడి 12 ఏళ్ల కుమారుడు వెంటనే 911కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
మృతుల వివరాలు
ఘటనా స్థలానికి చేరుకున్న గ్వినెట్ కౌంటీ పోలీసులు నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లు నిర్ధారించారు. వీరిలో మీము డోగ్రా (43) నిందితుడి భార్య కాగా (ఈమె భారతీయ పౌరురాలు), గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీష్ చందర్ (38) వీరు నిందితుడి బంధువులుగా గుర్తించారు.
అలమరలో దాక్కున్న చిన్నారులు
ఈ భీకర కాల్పుల సమయంలో ఇంట్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. నిందితుడి 12 ఏళ్ల కుమారుడితో పాటు 7, 10 ఏళ్ల వయస్సున్న మరో ఇద్దరు పిల్లలు ప్రాణభయంతో క్లోసెట్ (అలమర)లో దాక్కున్నారు. దీంతో వారికి ఎటువంటి గాయాలు కాలేదని, వారు సురక్షితంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
నిందితుడు విజయ్ కుమార్‌కు, అతని భార్యకు మధ్య అట్లాంటాలోని వారి నివాసంలో గొడవ మొదలైనట్లు సమాచారం. ఆ తర్వాత వారు తమ 12 ఏళ్ల కుమారుడిని తీసుకుని బ్రూక్ ఐవీ కోర్ట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా గొడవ సద్దుమణగకపోవడంతో, విజయ్ కుమార్ ఆవేశంతో ఊగిపోయి కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
భారత కాన్సులేట్ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల్లో ఒకరు భారతీయ పౌరురాలు ఉన్నారని, బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఘటన జరిగిన కొద్దిసేపటికే నిందితుడు విజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నాలుగు హత్య కేసులు, తీవ్రస్థాయి దాడి చిన్నారుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
